ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనున్న ఈ నెల 8వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దుకాణాలు, వాణిజ్య సముదాయాలకు కూడా ఇది వర్తింపజేయాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సోమవారం ఆదేశించారు. పోలింగ్‌కు 48 గంటల ముందు మద్యం దుకాణాలు మూసి వేయించాలని ఆయన నిర్దేశించారు. పోలీసు, అగ్నిమాపక శాఖ, ట్రాన్స్‌కో, జెన్‌కో మినహా మిగతా అన్ని ప్రభుత్వశాఖల వాహనాలను ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం కేటాయించాలని సీఎస్ ఆదేశించారు. పోలింగ్, ఓట్ల లెక్కింపు కోసం కేటాయించిన ఉద్యోగులు నిర్దేశించిన తేదీల్లో విధిగా హాజరు కావాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఉద్యోగులు ఎన్నికల నియమావళికి లోబడి వ్యవహరించాలని ఆదేశించారు. వ్యక్తిగత వాహనాలకు పార్టీ జెండాలు కట్టి ప్రచారం చేయడం, ఇళ్లపై జెండాలు కట్టడం వంటివి నిబంధనల ఉల్లంఘనల కిందకు వస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఏజెన్సీ మండలాల్లో 2 గంటల వరకే పోలింగ్
రాష్ట్రంలోని ఏజెన్సీ మండలాల్లో పరిషత్ పోలింగ్ మధ్యాహ్నం 2 గంటలకే ముగియనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మిగతా ప్రాంతల కంటే మూడు గంటల ముందుగా పోలింగ్ ముగించేందుకు అనుమతించాలన్న పంచాయతీరాజ్‌శాఖ ప్రతిపాదనలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. కలెక్టర్లతో సోమవారం నిర్వహించిన వీడియో సమావేశంలో పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఈ విషయాన్ని ప్రకటించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కర్నూలు జిల్లాలోని ఏజెన్సీ మండలాలకు 2 గంటలతో పోలింగ్ ముగించాలన్న నిర్ణయం వర్తిస్తుందని వివరించారు.