ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌ నిషిద్ధం!

త్వరలో చేపట్టనున్న వైద్యుల నియామకాల నుంచి ప్రైవేటు ప్రాక్టీస్‌ను నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించింది. వైద్య ఆరోగ్య సంస్కరణల కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ప్రైవేటు ప్రాక్టీస్‌ను నిషేధిస్తున్నందున నాన్‌ ప్రాక్టీస్‌ భత్యం కింద మూలవేతనంలో 15% అదనంగా ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇప్పటికే పనిచేస్తున్న వైద్యుల విషయంలో చర్యలు తీసుకునేందుకు తగిన సమయం అవసరమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది.

ap state government has decided to ban private practice from doctors appointments soon
ap state government has decided to ban private practice from doctors appointments soon

By

Published : May 27, 2020, 7:38 AM IST

ప్రొబేషనరీ కాలం ఏడాది పొడిగింపు
ప్రజారోగ్య శాఖ, వైద్య విధానపరిషత్‌, వైద్య విద్య సంచాలకుల కార్యాలయాల పరిధిలో కొత్తగా చేరిన వైద్యులకు రెండేళ్ల ప్రొబేషనరీ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీన్ని మరో ఏడాదికి పెంచాలని ఆర్థిక శాఖ.. వైద్య ఆరోగ్య శాఖకు సూచించినట్లు తెలిసింది. దీనిపై సమాలోచనలు జరుగుతున్నాయి.

ప్రత్యేక బోర్డు ఏర్పాటుపై..
వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్‌ బోర్డును ఏర్పాటుచేసి నియామకాలను చేపట్టడంపై అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రజారోగ్య శాఖ, వైద్య విధానపరిషత్‌, వైద్యవిద్య సంచాలకుల పరిధిలో వైద్యుల నియామకాలు వేర్వేరుగా జరుగుతున్నాయి. సందర్భానుసారం నియమిస్తున్నందున ప్రత్యేక బోర్డు ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని ఆర్థిక శాఖ అభిప్రాయపడింది. తమిళనాడులో మాదిరి ప్రత్యేక బోర్డు ద్వారా నియామకాలపై అడపాదడపా చర్చిస్తున్నప్పటికీ కార్యాచరణలోకి రావడం లేదు.

2,112 వైద్యుల పోస్టులు
వైద్య ఆరోగ్య శాఖలో 9,712 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిల్లో వైద్యుల పోస్టులు 2,112 వరకున్నాయి. 9,712 పోస్టుల్లో 4,011 ఇప్పటికే ఖాళీగా ఉన్నాయి. పెరగనున్న సేవల దృష్ట్యా అదనంగా 5,701 పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ప్రజారోగ్య శాఖ పరిధిలోని వైద్యుల పోస్టులను ఎంబీబీఎస్‌ అర్హతున్న వారితో భర్తీ చేస్తారు. వైద్యవిధాన పరిషత్‌ పరిధిలో భర్తీ చేసే పోస్టులను ఇకపై స్పెషలిస్టు అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్‌ (సర్జన్‌ జనరల్‌ మెడిసిన్‌, ఇతర) పేర్కొనాలన్న అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

మంజూరైనవి శాశ్వత ప్రాతిపదికన..
ఇప్పటికే ప్రభుత్వం మంజూరుచేసి ఖాళీగా ఉన్న పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈ జాబితాలో వైద్యులతోపాటు స్టాఫ్‌నర్సులు, ల్యాబ్‌టెక్నీషియన్లు, ఫార్మసిస్టుల పోస్టులున్నాయి. పాలనాపరంగా అవసరమైన ఉద్యోగాలను ఒప్పంద లేదా పొరుగుసేవల ప్రాతిపదికన భర్తీ చేయాలని సూచించారు. గుర్తించిన ఖాళీల వివరాల పట్టిక...

ఇదీ చదవండి:మచిలీపట్నం పోర్టు రైట్స్ సంస్థ డీపీఆర్‌లకు రూ.3.48 కోట్ల చెల్లింపులు

ABOUT THE AUTHOR

...view details