రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. వాతావరణం కొంత చల్లబడినట్లే అనిపించినా గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ వినియోగం అనూహ్యంగా 20 శాతం పెరిగింది. దీనికితోడు దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు బొగ్గు కొరత ఎదుర్కొంటున్నాయి. జెన్కో థర్మల్ ప్లాంట్లు సైతం ఇదే సమస్యతో కొన్ని యూనిట్ల నుంచి ఉత్పత్తి నిలిపేశాయి. దేశవ్యాప్తంగా విద్యుత్‌కు డిమాండ్ పెరగటంతో యూనిట్ రూ.20 వెచ్చించి బహిరంగ మార్కెట్లో కొందామన్నా దొరకటం లేదు.
(సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల) సమయంలో విద్యుత్ దొరకటం కష్టంగా ఉంది. లోడ్ సర్దుబాటు కోసం అవసరాన్ని బట్టి ఈ సమయంలో వ్యవసాయ, గ్రామీణ ప్రాంతాలు రేడియల్ ఫీడర్లకు సరఫరా నిలిపేస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో 2-3 గంటలు విద్యుత్ కోతలు తప్పడం లేదు. అప్పటికీ సర్దుబాటు కాకుంటే చిన్న పట్టణాలకు సరఫరా నిలిపేస్తున్నారు. గ్రిడ్ భద్రత కోసం కోతలు విధించక తప్పడం లేదని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో సాధారణంగా రోజువారీ విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోవడానికి 8000- 8500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. గత నెల 18న ఇది 10,066 మెగావాట్లను తాకడం పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి నిదర్శనం.
వ్యవసాయానికీ ఇబ్బంది
ప్రస్తుతం వరితో పాటు మెట్ట పంటల సాగుకు రోజుకు కనీసం 20 ఎంయూల విద్యుత్ అవసరం. కనీసం ఫిబ్రవరి వరకు ఈ స్థాయిలో ఇవ్వకపోతే నీరందక పంటలు దెబ్బతింటాయి. అక్కడి నుంచి వేసవి మొదలవటంతో వినియోగం మరింతగా పెరుగుతుంది. రానున్న వేసవిలో రోజువారీ డిమాండ్ సుమారు 230 ఎంయూలకు చేరుతుందని అంచనా.
థర్మల్ ప్లాంట్లకు బొగ్గు కొరత
రాష్ట్రంలోని జెన్కో థర్మల్ ప్లాంట్లకు రోజుకు సుమారు 70 వేల టన్నుల బొగ్గు అవసరం. గత నెలాఖరు వరకు రోజుకు 24 వేల టన్నులే అందుబాటులో ఉంది. ప్రస్తుతం సింగరేణి, మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి రోజుకు 40 వేల టన్నుల వరకు అందుతోంది.
*బొగ్గు ఉత్పత్తి కేంద్రాలు అక్టోబరు నుంచి 2022 జనవరి వరకు వేసవిని దృష్టిలో ఉంచుకుని బొగ్గు నిల్వలు పెంచాలి. రోజుకు కనీసం 20 రేక్‌లు (ఒక్కో రేక్‌కు 3,500 టన్నులు) వస్తే ప్రస్తుత అవసరాలు పోను వేసవి కోసం కొంత బొగ్గు నిల్వ చేసుకోగలమని ఒక అధికారి తెలిపారు. ప్రస్తుతం రోజుకు 8-10 రేక్‌లు మాత్రమే వస్తున్నాయి.
జెన్కో ప్లాంట్లపై ప్రభావం