కష్టకాలంలో పోలీసులను, వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం, హోంశాఖ అందిస్తోన్న బీమా మొత్తం మరింత పెరిగింది. గతంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన... కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై వరకు సుమారు రూ.13 లక్షల బీమా చెల్లిస్తుండగా ఇప్పుడు రూ.20 లక్షలకు పెంచారు. ఎస్సై నుంచి ఇన్‌స్పెక్టర్ వరకు రూ.35 లక్షల బీమా చెల్లించనున్నారు. డీఎస్పీ, ఆపైస్థాయి అధికారులకు రూ.45 లక్షలు గ్రూప్ ఇన్సూరెన్స్ కింద చెల్లించనున్నారు.
క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సవరించిన ఇన్సూరెన్స్ పాలసీని... సీఎం జగన్ ఆమోదించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత పోలీసుల గ్రూప్ ఇన్సూరెన్స్‌లో పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం, పోలీసు శాఖల తరఫున యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి రూ.4.74 కోట్ల చెక్కును సీఎం జగన్ అందించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతంసవాంగ్, అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ సహా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
గ్రూపు ఇన్సూరెన్స్‌తోపాటు ప్రమాదవశాత్తూ పోలీసులకు ఏదైనా జరిగితే... దానికింద చెల్లించే బీమాను పెంచారు. పోలీసు సిబ్బంది అసహజ మరణం పొందితే రూ.30 లక్షలు, తీవ్రవాదులు లేదా ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోతే రూ.40 లక్షలు అందిస్తారు. ప్రమాదంలో గాయపడితే... తీవ్రతను బట్టి పరిహారం అందజేస్తారు. శాశ్వతంగా వికలాంగులుగా లేదా ఇతరత్రా గాయాలతో ఇంటికే పరిమితమైతే వారికి నిబంధనల మేరకు పరిహారం అందజేస్తారు.