పింఛన్ల సంఖ్య తగ్గించుకోవాలన్న ఆలోచన తమకు లేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇప్పటివరకు 53లక్షల 70వేల 210 మందికి పింఛన్లు ఇచ్చామని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా కొత్తగా 6 లక్షల మందికి పింఛన్లు ఇచ్చినట్లు తెలిపారు. 4లక్షల 16వేల 34 మందిని అనర్హులుగా గుర్తించామని.. వారిలోనూ పునఃపరిశీలన చేసి పింఛన్లు ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు.
'ప్రతిపక్షాలవి అసత్యాలు.. పింఛన్లు తగ్గించలేదు'
చంద్రబాబు సహా ప్రతిపక్ష నేతలు ప్రభుత్వం మీద బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తమ హయాంలో 6 లక్షలకు మందికిపైగా కొత్తగా పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. అనర్హుల ఇళ్లకు వార్డు వాలంటీర్లు వెళ్లి పునఃపరిశీలిస్తారని... అర్హులైన వారికి రెండు నెలల పింఛన్‌ను కలిపి అందజేస్తామని ప్రకటించారు.
మంత్రి బొత్స సత్యనారాయణ
కియా సంస్థ ప్రతినిధులు చెప్పినా పరిశ్రమ తరలిపోతోందని తెదేపా నేతలు గగ్గోలు పెట్టడం ఆశ్చర్యంగా ఉందన్నారు. వేల కోట్లు పెట్టుబడి పెట్టి ఎవరైనా వెళ్లిపోతారా అని ప్రశ్నించారు. ఫోక్స్ వ్యాగన్ వ్యవహారంలో నమ్మి మోసపోయానని.. దానిపై సీబీఐ దర్యాప్తు కూడా వేసుకున్నామని ఈ సందర్భంగా బొత్స వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి.. పింఛన్లు ఎందుకు తొలగించారు.. బొత్సను నిలదీసిన మహిళలు