చట్ట నిబంధనలను అనుసరించకపోవడం దురదృష్టకరమని హైకోర్టు వ్యాఖ్యానించింది. చాలా కేసుల్లో పోలీసుల తీరు ఇలాగే ఉండటాన్ని గమనిస్తున్నామని పేర్కొంది. ఇది సీబీఐ దర్యాప్తునకు ఇవ్వడానికి తగిన కేసని అభిప్రాయపడింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న.. సీబీఐ డైరెక్టరు, విశాఖ సీబీఐ ఎస్పీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శితో పాటు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ప్రకాశం జిల్లా ఎస్పీ, చీరాల డీఎస్పీ, చీరాల రెండో పట్టణ ఠాణా ఎస్‌హెచ్‌వోకు నోటీసులు జారీచేసింది. కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంపై వివరాలను సమర్పించాలని సీబీఐ తరఫు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) చెన్నకేశవులుకు స్పష్టం చేసింది. రాష్ట్ర హోంశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది (జీపీ) మహేశ్వరరెడ్డి గడువు కోరడంతో విచారణను అక్టోబరు 1కి వాయిదా వేసింది. మాస్కు పెట్టుకోలేదని పోలీసులు కొట్టడంవల్లే చీరాలకు చెందిన యువకుడు కిరణ్ కుమార్ మృతి చెందారని, దీనిపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపీ హర్షకుమార్ హైకోర్టులో పిల్ వేశారు.
దళిత యువకుడి మృతి కేసు: కౌంటర్ దాఖలుకు హైకోర్ట్ ఆదేశం - పోలీసులపై ఏపీ హైకోర్టు కామెంట్స్
ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన దళిత యువకుడు కిరణ్ కుమార్ మృతి కేసుకు సంబంధించి.. హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దాడి జరిగిన సమయంలో.. పోలీసులపై ఐపీసీ సెక్షన్ 324 కింద నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను.. ఆ యువకుడు మృతి చెందాక సెక్షన్ 302 (హత్యా నేరానికి శిక్ష) కిందకు ఎందుకు మార్చలేదని ప్రశ్నించింది.
అధికార పార్టీ నేతల ప్రభావంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఆరోపించారు. నిష్పాక్షిక దర్యాప్తు కోసం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. మంగళవారం జరిగిన విచారణలో పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. పోలీసులు కిరణ్ కుమార్‌ను హతమార్చారన్నారు. యువకుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 324 (ఆయుధాలతో గాయపరచడం) కింద మొదట ఈ ఏడాది జులై 19న ఎస్సైపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, యువకుడు మృతి చెందాక సీఆర్‌పీసీ సెక్షన్ 176 (మరణం సంభవించిన ఘటనల్లో మేజిస్ట్రేట్ ద్వారా విచారణ) కింద జులై 22న కేసు నమోదు చేశారే తప్ప జ్యుడీషియల్ విచారణ జరపలేదని తెలిపారు. జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించలేదని పేర్కొన్నారు.
జీపీ వాదనలు వినిపిస్తూ..మృతుడి తల్లిదండ్రులు ఇప్పటికే వ్యాజ్యం దాఖలు చేశారని, దర్యాప్తుపై ‘సంతృప్తి చెంది’ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారని తెలిపారు. పూర్తి వివరాలను సమర్పించేందుకు గడువు కావాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘పోలీసుల బెదిరింపులతో రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందుతారు’ అని నర్మగర్భంగా వ్యాఖ్యానించింది. సెక్షన్ 324 కింద నమోదైన కేసును.. యువకుడు మృతి చెందాక సెక్షన్ 302 కిందకు మార్చాలని అభిప్రాయపడింది. నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తున్నామని, వివరాలు సమర్పించేందుకు గడువు కావాలని జీపీ కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఘటనలో కిరణ్ కుమార్ వెంట ఉన్న మరో వ్యక్తి ఫోన్ కాల్ వివరాలను సీడీ రూపంలో కోర్టు ముందు ఉంచేందుకు అనుమతించాలని కోరారు. అందుకు నిరాకరించిన ధర్మాసనం.. తాము విచారణ, దర్యాప్తు చేయడం లేదని స్పష్టం చేసింది.