ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాజకీయ పార్టీ రంగులు తొలగించేందుకు తక్షణం చర్యలు చేపట్టాలి' - ap local election code

ప్రభుత్వ కార్యాలయాలకు రాజకీయ పార్టీల జెండా రంగులు వేయడానికి వీల్లేదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పంచాయతీ కార్యాలయాలకు వైకాపా జెండాను పోలిన రంగులు వేసేందుకు వీలుగా పంచాయతీరాజ్‌శాఖ అధికారులు జారీచేసిన మెమోను రద్దుచేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, పంచాయతీ కార్యాలయాలకు వేసిన రాజకీయ పార్టీ రంగులు తొలగించేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని ఆదేశించింది. పదిరోజుల్లో ఇదంతా పూర్తిచేయాలని చెప్పింది. రాజకీయ పార్టీలతో సంబంధం లేని రంగును పంచాయతీ/ప్రభుత్వ భవనాలకు వేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) మార్గదర్శకాలను రూపొందించాలని తెలిపింది. ఇప్పటికే పంచాయతీ భవనాలకు వేసిన రంగుల్ని తొలగించి, సీఎస్‌ నిర్ణయించిన రంగు వేయాలని స్పష్టంచేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్ని నిష్పక్షపాతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

high court
'పంచాయతీ కార్యాలయాలకు వైకాపా రంగులు...దుష్ట సంప్రదాయమే'

By

Published : Mar 11, 2020, 5:36 AM IST

Updated : Mar 11, 2020, 6:38 AM IST

'రాజకీయ పార్టీ రంగులు తొలగించేందుకు తక్షణం చర్యలు చేపట్టాలి'

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు గ్రామ పంచాయతీ కార్యాలయానికి వైకాపా జెండా రంగులేయడాన్ని నిలువరించాలని అభ్యర్థిస్తూ రైతు ముప్ప వెంకటేశ్వరరావు హైకోర్టులో పిల్‌ దాఖలుచేసిన విషయం తెలిసిందే. పార్టీ రంగులేయొద్దని కోర్టు ఆదేశించిన తర్వాత విజయనగరం జిల్లా లక్కవరపుకోట తలారి గ్రామంలో కార్యాలయానికి రంగులేశారంటూ రమణ మరో వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది పాణిని సోమయాజి వాదనలు వినిపించారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల వాదనలు పూర్తికావడంతో హైకోర్టు మంగళవారం తీర్పుచెప్పింది. సీజే అనుమతితో జస్టిస్‌ జయసూర్య తీర్పు చదివారు.

ఎన్నికల సంఘం తీరుపై ఆక్షేపణ

పిటిషనర్లు దాఖలుచేసిన పిల్స్‌కు విచారణార్హత లేదని ప్రభుత్వం చేసిన వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. పంచాయతీ భవనాలకూ జాతీయ బిల్డింగ్‌ కోడ్‌ వర్తిస్తుందని తెలిపింది. అందువల్ల రాజకీయ ప్రయోజనాల కోసం పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడానికి వీల్లేదంది. ఎన్నికల సమయంలో పంచాయతీ భవనాలకు వైకాపా రంగులేయడం దుష్ట సంప్రదాయాల్ని అనుసరించడమేనంది. అది ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడం అవుతుందని తెలిపింది. రాష్ట్ర ఎన్నికల సంఘం తీరును హైకోర్టు ఆక్షేపించింది. ఎన్నికల ప్రకటన వెలువడేవరకు ఎన్నికల సంఘం మౌనం వహించడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. కార్యాలయాలకు రంగుల తొలగింపు విషయంలో కోర్టు ఆదేశాల్ని, పిటిషనర్‌ వినతిని ఎన్నికల సంఘం తిరస్కరించిందని గుర్తుచేసింది.

ఎన్నికల ప్రకటన వెలువడకుండా తాము చర్యలు తీసుకోలేమని చెప్పడం సరికాదని తెలిపింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. ప్రభుత్వం ఆరోపించినట్లు ఈ వ్యాజ్యాల వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవని స్పష్టం చేసింది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ రంగులేయడం అలవాటుగా మారిందని, ఆ విధానానికి స్వస్తిపలకాలని పేర్కొంది. ఒక పార్టీ రంగులేస్తే ఆ పార్టీ సిద్ధాంతాన్ని ప్రచారం చేసినట్లవుతుందని.. దీంతో నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు తావులేకుండా పోతుందని స్పష్టం చేసింది. మరోవైపు రాజకీయ పార్టీల రంగులేయాలని అధికారులు ప్రతిపాదించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనంది. అంతేకాక ఆ చర్య ఎన్నికల చట్టాల్ని, నిబంధనలను ఉల్లంఘించినట్లే అని పేర్కొంది.

వైకాపా రంగులేయడానికి వీల్లేదని, వాటిని తొలగించాలని తాము మధ్యంతర ఉత్తర్వులిచ్చినా అధికారులు చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే వారి ఉద్దేశమేంటో అర్థమవుతోందని ఆక్షేపించింది. ప్రభుత్వం జారీచేసిన మెమోను సాకుగా చూపుతూ పంచాయతీ భవనాలకు వైకాపా రంగులేయడాన్ని నిలువరించకపోగా.. కొనసాగిస్తూనే ఉన్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో గతేడాది ఆగస్టు 11న ప్రభుత్వం జారీచేసిన మెమోను రద్దు చేస్తున్నామంది. సుప్రీంకోర్టు, వివిధ రాష్ట్రాల హైకోర్టులు, కేంద్ర ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకొని రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ట్ర ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహిస్తుందని భావిస్తున్నామని పేర్కొంది. హైకోర్టు రిజిస్ట్రీ ఈ తీర్పు ప్రతిని ఫ్యాక్స్‌ ద్వారా సీఎస్‌, పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి, కేంద్ర ఎన్నికలకమిషన్‌కు పంపాలని తెలిపింది. తద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ విధులను పరిశీలించడానికి, హైకోర్టు ఆదేశాలు అమలయ్యేలా చూసేందుకు కేంద్రఎన్నికల కమిషన్‌కు వీలుంటుందని చెప్పింది.

ఇవీ చూడండి-కరోనా ఎఫెక్ట్.. శ్రీవారి దర్శనం టిక్కెట్లు రద్దు చేసుకునే అవకాశం

Last Updated : Mar 11, 2020, 6:38 AM IST

ABOUT THE AUTHOR

...view details