ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్టేటస్ కో ఉండగానే రైతు భరోసా కేంద్రం నిర్మిస్తారా..?: హైకోర్టు - tirumalaayapalli village secretariat at burrial groud

చిత్తూరు జిల్లాలోని తిరుమలాయపల్లి గ్రామంలో చేపట్టిన రైతు భరోసా కేంద్ర నిర్మాణ పనులపై దాఖలైన పిటిషన్ ను హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఓ సారి స్టేటస్ కో ఉత్తర్వులిచ్చాక అదే స్థలంలో మరో పథకం పేరు చెప్పి నిర్మాణం చేపట్టడం ఏమిటని ప్రశ్నించింది. కౌంటర్లు దాఖలు చేయాలని అధికారుల్ని ఆదేశిస్తూ విచారణను డిసెంబర్ మొదటి వారానికి వాయిదా వేసింది.

ap-high-court
ap-high-court

By

Published : Nov 10, 2020, 2:43 AM IST

కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఓ స్థలంలో అధికారులు రైతు భరోసా కేంద్రం నిర్మించడంపై హైకోర్టు కన్నెర్ర చేసింది. ఉల్లంఘనకు పాల్పడిన అధికారులపై కోర్టు ధిక్కరణ దాఖలు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి సూచించింది. ఆ అధికారుల్ని రక్షించడానికి అప్పుడెవరొస్తారో చూస్తామని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో బాధ్యులపై సుమోటోగా కోర్టు ధిక్కరణ తీసుకునే అధికారం తమకు ఉందని స్పష్టం చేసింది. చిత్తూరు జిల్లా తిరుమలాయపల్లిలో రైతు భరోసా కేంద్రం నిర్మాణ పనులపై దాఖలపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. పట్నాలో ఓ కేసు విషయంలో హైకోర్టు ఆదేశాల్ని పాటించని జిల్లా న్యాయాధికారిన అటు నుంచి అటే జైలుకు పంపారని కోర్టు గుర్తు చేసింది.

ఎలా వ్యవహరించాలో తెలుసు..

తమ ఉత్తర్వుల అమలుకు ఎంతవరకైనా వెళతామని స్పష్టం చేసింది. ఉత్తర్వుల్లో ఒక్క పదాన్ని అమలు చేయకపోయినా బాధ్యులైన అధికారులపై చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించింది. రాజకీయ పార్టీల నేతలు చెప్పినట్లు అధికారులు ఆడతామంటే కుదరదని.. నిబంధనల మేరకు వ్యవహరించాలని హితవు పలికింది. న్యాయవ్యవస్థను ఎలా నడపాలో, బ్యూరోక్రాట్లతో ఎలా వ్యవహరించాలో తమకు తెలుసంది. చిత్తూరు జిల్లా తిరుమలాయపల్లిలో రైతు భరోసా కేంద్రం నిర్మాణ పనుల్ని నిలిపేయాలని అధికారుల్ని ఆదేశించింది. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రానికి అక్కడి స్థలాన్ని వినియోగించొద్దని స్పష్టం చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని అధికారుల్ని ఆదేశిస్తూ విచారణను డిసెంబర్ మొదటి వారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్ , జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది .

గత సెప్టెంబర్ 24న స్టేటస్ కో ఉత్తర్వులు..

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం తిరుమలాయపల్లి గ్రామం సర్వే నంబర్ 205 / 17 లోని మామిడితోపు , బండీదారి స్థలంలో రైతు భరోసా కేంద్రం నిర్మిస్తున్నారని పేర్కొంటూ సుబ్రమణ్యంరెడ్డి, యర్రసాని గోపిరెడ్డి హైకోర్టులో పిల్ వేశారు. వారి తరఫున న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా నిర్మాణం చేస్తున్నారన్నారు. ఇదే సర్వే నంబర్లో గ్రామ సచివాలయం నిర్మిస్తుంటే హైకోర్టును ఆశ్రయించగా గత సెప్టెంబర్ 24న యథాతథ స్థితి ఉత్తర్వులిచ్చిందన్నారు. ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ అదే స్థలంలో రైతు భరోసా కేంద్ర నిర్మిస్తున్నారని చెప్పారు. ఆ స్థలం వివరాలతో పాటు సర్వే నంబర్‌ను ఆన్ లైన్లో కనిపించకుండా అధికారులు తొలగించారని తెలిపారు.

ఉత్తర్వులిచ్చాక ఎలా నిర్మాణం చేపట్టారు.?

వాదనలు విన్న ధర్మాసనం .. ఓ సారి స్టేటస్ కో ఉత్తర్వులిచ్చాక అదే స్థలంలో మరో పథకం పేరు చెప్పి నిర్మాణం చేపట్టడం ఏమిటని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. కోర్టు ఉత్తర్వులకు కట్టుబడి గ్రామ సచివాలయం నిర్మించలేదని తెలిపారు. సర్వే నంబరు ఒక్కటైనా అక్కడ విశాలమైన స్థలం ఉండటంతో ప్రజాహితార్థం రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఏది ప్రజాహితమో, ప్రభుత్వం చేపడుతున్న అన్ని విషయాల గురించి తమకు తెలుసని వ్యాఖ్యానించింది. తమ ఉత్తర్వులపై అభ్యంతరముంటే సుప్రీంకోర్టుకు వెళ్లండి.. అంతే తప్ప ఉల్లంఘించండానికి వీల్లేదని తేల్చి చెప్పింది.

ఇదీ చదవండి

తుంగభద్ర పుష్కరాల్లో నదీ స్నానం నిషేధం: కలెక్టర్

ABOUT THE AUTHOR

...view details