కరోనా నేపథ్యంలో మద్యం విక్రయాలు జరపడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మాతృభూమి ఫౌండేషన్‌తో పాటు మరొకరు వేసిన పిటిషన్లపై హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. కరోనా వ్యాప్తి సమయంలో మద్యం దుకాణాలకు అనుమతివ్వడం సరైన చర్య కాదని పిటిషనర్ తరఫు న్యాయవాది బీఎస్ఎన్వీ ప్రసాద్ బాబు వాదించారు. మద్యం షాపుల వద్ద వినియోగదారులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. మద్యం తాగడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం ఉందన్నారు.
ఈ నేపథ్యంలో మద్యం విక్రయాలు చేయడం వల్ల కరోనా వ్యాప్తి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని న్యాయస్థానానికి తెలిపారు. ప్రభుత్వం మద్య నిషేధం అమలు చేస్తామని చెబుతోందని, ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది కాబట్టి నిషేధం అమలు చేయాలని కోరారు. అంతేకాకుండా ప్రస్తుతం మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్న వివిధ రకాల చీప్ లిక్కర్‌ను పరీక్షలకు పంపాలని పిటిషినర్ తరఫు న్యాయవాది కోరారు.