కడప జిల్లా గండికోట జలాశయం ముంపు బాధితుల పరిహారం చెల్లింపు వివరాలు, ప్రజాహిత వ్యాజ్యంపై అభ్యంతరాలేమిటో తెలియజేస్తూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వ్యాజ్యాలపై తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. గండికోట జలాశయం ముంపు బాధితుల పరిహారంపై పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్పై ఆయన తరపు న్యాయవాది చల్లా అజయ్ కుమార్ హైకోర్టులో వాదనలు వినిపించారు. జలాశయం నీటి నిల్వ వల్ల పలుగ్రామాలు మునిగిపోతున్నాయని, గ్రామాల్ని ఖాళీ చేయించాలన్న ఉద్దేశంతో నీటి నిల్వ పెంచుతున్నారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకూ బాధితులకు పరిహారం చెల్లించలేదన్నారు.
ప్రచురణ ఉద్దేశంతో వ్యాజ్యాలు
వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ .. పలు ప్రజాహిత వ్యాజ్యాలు ప్రచురణ ఉద్దేశంతో హైకోర్టులో దాఖలవుతున్నట్లు తమ దృష్టిలో ఉందని తెలిపింది. ప్రస్తుత వ్యాజ్యంలో ఉన్న అంశాలు పత్రికల్లో యథాతథంగా ప్రచురించారని గుర్తుచేసింది. ఈ తరహా ప్రజాహిత వ్యాజ్యాలను అనుమతించేది లేదని స్పష్టంచేసింది. మీడియా నిర్ణయిస్తుందనుకుంటే అక్కడికే వెళ్లాలని సూచించింది. హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని ప్రశ్నించింది. ఈ వ్యాజ్యాలపై గతంలో విచారణ జరిపి ... కేవలం వాయిదా వేశామని గుర్తుచేసింది. మరుసటి రోజు మాత్రం మొత్తం వాదనలు, పిటిషన్లోని పూర్తి వివరాల్ని ప్రచురించారని తెలిపింది. ఈ విధానాన్ని అనుమతించబోమని కోర్టు స్పష్టంచేసింది. ప్రచారం కోసం పిల్ దాఖలు చేస్తే నిరత్సాహపరుస్తామని స్పష్టంచేసింది.