ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 16, 2021, 2:23 PM IST

ETV Bharat / city

Black fungus: 'బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు అందుబాటులో ఉంచే బాధ్యత కేంద్రానిదే'

బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు అందుబాటులో ఉంచే బాధ్యత కేంద్రానిదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుపై కేంద్రం చర్యలు చేపట్టాలని ఆదేశించింది. కొవిడ్ నియంత్రణ చర్యలు, బ్లాక్ ఫంగస్ కేసులపై హైకోర్టులో విచారణ జరిగింది.

HIGH COURT ON COVID
HIGH COURT ON COVID

కొవిడ్ నియంత్రణ చర్యలు, బ్లాక్ ఫంగస్ కేసులపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆధార్ లేకుండా వృద్ధాశ్రమాల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేశామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. రాష్ట్రంలో 2,357 బ్లాక్‌ఫంగస్ కేసులు, 175 మరణాలు నమోదయ్యాయని వివరించారు. ప్రస్తుతం 1,385 కేసులు క్రియాశీలంగా ఉన్నాయని.. అంఫోటెరిసిన్‌-బి ఇంజక్షన్ల సరఫరాలో కొరత ఉందని వెల్లడించారు. వారానికి 8-10 వేలకు మించి ఇంజక్షన్లు రావట్లేదని.. డిమాండ్‌కు తగ్గట్లు ఇంజక్షన్లు కేంద్రం సరఫరా చేయట్లేదని తెలిపారు.

బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ల కొరత తీవ్రతను కోర్టు అమికస్ క్యూరీ దృష్టికి తీసుకువెళ్లారు. బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు అందుబాటులో ఉంచే బాధ్యత కేంద్రానిదేననని హైకోర్టు స్పష్టం చేసింది. ఇంజక్షన్ల సరఫరా పెంచేందుకు కేంద్రం తీసుకున్న చర్యలను ఏఎస్‌జీ వివరించారు. 11 ఫార్మా కంపెనీలకు తయారీ అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు.

ఎన్ని ఇంజక్షన్లు అవసరమో కౌంటర్​ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. పూర్తిస్థాయి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సూచించింది. బ్లాక్ ఫంగస్ తీవ్రత దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని ఆదేశించింది.

ఎందుకు ఆలస్యమైంది..?

ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాట్లలో జాప్యాన్ని హైకోర్టు ప్రశ్నించింది. స్థలాల ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రావాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది అన్నారు. సమస్యను కోర్టు దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ధర్మాసనం ప్రశ్నించింది. ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుపై కేంద్రం చర్యలు చేపట్టాలని ఆదేశించింది. తాజాగా చేపట్టిన చర్యలపై సమగ్ర వివరాలతో మెమో దాఖలు చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా పడింది.

ఇదీ చదవండి:

విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు.. ఆరుగురు మావోయిస్టులు మృతి

ABOUT THE AUTHOR

...view details