AP High Court on PRC: తాజాగా ఇచ్చిన పీఆర్సీ (వేతన సవరణ) ఉత్తర్వుల ఆధారంగా ఏ ప్రభుత్వ ఉద్యోగి జీతం నుంచీ రికవరీలు చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ వేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక, రెవెన్యూ శాఖల ముఖ్యకార్యదర్శులు, కేంద్ర హోం శాఖ కార్యదర్శి, పే రివిజన్ కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. సమ్మె ఏ సమస్యకూ పరిష్కారం కాదని.. కోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్నప్పుడు సమ్మె చేయడం న్యాయస్థానంపై ఒత్తిడి తీసుకురావడం లాంటిదేనని అభిప్రాయపడింది. ప్రస్తుత ఉత్తర్వులతో సమ్మెకు వెళ్లరని భావిస్తున్నట్లు పేర్కొంది. జనవరి 17న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ గెజిటెడ్ అధికారుల ఐకాస ఛైర్మన్ కేవీ కృష్ణయ్య హైకోర్టులో వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం మంగళవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం వద్దకు విచారణకు వచ్చింది. రిట్ నిబంధనల ప్రకారం ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించాలని అడ్వొకేట్ జనరల్.. సింగిల్ జడ్జి వద్ద విచారణ సమయంలో చెప్పారని సీజే గుర్తు చేశారు. ఈ విషయాన్ని అంతకు ముందు వేరే డివిజన్ బెంచ్ వద్ద ఎందుకు చెప్పలేదని ఏజీని ప్రశ్నించారు. బెంచ్ హంటింగ్‌ను ప్రోత్సహించలేమని, జరుగుతున్న పరిణామాలపై సంతృప్తికరంగా లేమని వ్యాఖ్యానించారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఉన్నది ఉన్నట్లు ఓపెన్ కోర్టులోనే మాట్లాడటం తనకున్న అలవాటని వ్యాఖ్యానించారు.
పీఆర్సీ జీవోతో జీతాలు తగ్గుతాయి: పిటిషనర్
పిటిషనర్ తరఫు న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపిస్తూ.. విశ్రాంత ఐఏఎస్ అధికారి అశుతోష్ మిశ్ర నేతృత్వంలోని పే రివిజన్ కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం బహిర్గతం చేయలేదన్నారు. ఆ నివేదికను పరిశీలించేందుకు కార్యదర్శులతో ప్రభుత్వం కమిటీ వేసిందన్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌తో సమావేశాలు నిర్వహించినా నివేదికను బయటపెట్టలేదన్నారు. పీఆర్సీ కొత్త జీవోతో జీతాలు తగ్గుతున్నాయన్నారు. ప్రస్తుత పీఆర్సీ 2018 జులై 1 నుంచి అమలవుతుందని పేర్కొన్నారన్నారు. అప్పటి నుంచి ఉద్యోగులకు అదనంగా చెల్లించి ఉంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వాటిని రాబట్టుకునే (రికవరీ) అధికారం ప్రభుత్వం తీసుకుందన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమన్నారు. డీఏ, హెచ్‌ఆర్‌ఏలో కోతతోపాటు సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్‌ను పూర్తిగా ఉపసంహరించారన్నారు. గతంలో డివిజన్ బెంచ్ వద్ద జరిగిన విచారణలో ఉద్యోగ సంఘాలు సమ్మెకు వెళ్లబోతున్నాయి.. ముందుగా నిలువరించాలని ఏజీ కోరారని తెలిపారు.