Amaravati Farmers Meeting: అమరావతి పరిరక్షణ సమితి ఈ నెల 17న తిరుపతి సమీపంలోని దామినీడులో తలపెట్టిన బహిరంగ సభకు హైకోర్టు అనుమతినిచ్చింది. అక్కడ పిటిషనర్ సూచించిన ప్రైవేటు స్థలంలో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6లోపు సభ నిర్వహించుకోవచ్చని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా సభ నిర్వహణకు పోలీసులు అనుమతి ఇవ్వకపోడం రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను నిరాకరించడమేనని తెలిపింది. సమస్యలపై ఉద్యమించడం, గొంతెత్తడం ప్రాథమిక హక్కుల్లో భాగమేనని స్పష్టం చేసింది. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందనే కారణంతో అనుమతి నిరాకరించడానికి వీల్లేదంది. అలాంటి పరిస్థితులకు తావులేకుండా రక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టంచేసింది. పిటిషనర్ సంస్థ పేర్కొన్న స్థలంలో బహిరంగ సభ నిర్వహణకు అనుమతి ఇచ్చేలా తిరుపతి అర్బన్ ఎస్పీని ఆదేశించాలని రాష్ట్ర డీజీపీకి స్పష్టం చేసింది. సభ శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసులు షరతులు విధించొచ్చని పేర్కొంది. మరోవైపు సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు, దుర్భాషలాడకూడదని పిటిషనర్ సమితికి స్పష్టం చేసింది. శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని తెలిపింది. న్యాయస్థానం విధించిన షరతులను తప్పక పాటించాలంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్ బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.
* మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా 17న తిరుపతి సమీపంలోని దామినీడులో సభకు అనుమతివ్వాలని పోలీసులను అమరావతి పరిరక్షణ సమితి కోరింది. అనుమతి నిరాకరించడంతో సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు, అధ్యక్షుడు ఎ.శివారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. వారి తరఫున న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, వీవీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ‘పోలీసులు చూపిన కారణాలు సరైనవి కాదు. సభ తిరుపతిలో నిర్వహించడం లేదు. ఆరు కి.మీ. దూరంగా దామినీడులో పెడుతున్నాం. సభకు అనుమతించకపోవడం హక్కులను హరించడమే. అనుమతినిచ్చేలా పోలీసులను ఆదేశించండి’ అని కోరారు.
* పోలీసుల తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘మహా పాదయాత్ర సందర్భంగా కోర్టు విధించిన షరతులను సమితి సభ్యులు ఉల్లంఘించారు. వారి వీడియో క్లిప్పింగ్‌లను పరిశీలించండి. యాత్రలో రాజకీయ నేతలు పాల్గొని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంది. కొవిడ్ వ్యాప్తికి వీలుంది. మూడు రాజధానులకు మద్దతుగా వేరే సంఘం అదే రోజు సభకు అనుమతి కోరింది. పిటిషనర్ సభ నిర్వహించదలచిన ప్రదేశం రాయలసీమ. అక్కడి ప్రజలు మూడు రాజధానులు కోరుకుంటున్నారు. అమరావతి కోసం అక్కడెలా సభ పెడతారు? అమరావతి పరిధిలో ఎన్ని సభలు పెట్టుకున్నా అభ్యంతరం లేదు’ అన్నారు.