ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రైవేట్ సంస్థ చేతికి.. ఇసుక రీచ్‌ల్లో తవ్వకాల బాధ్యత - జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్

ap govt on sand
ap govt on sandప్రైవేట్ సంస్థ చేతికి.. ఇసుక రీచ్‌ల్లో తవ్వకాల బాధ్యత

By

Published : Mar 20, 2021, 7:16 PM IST

Updated : Mar 21, 2021, 7:36 AM IST

19:12 March 20

రాష్ట్రంలో ఇసుక తవ్వకాల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థకు అప్పగించింది. కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థ ఎంఎస్​టీసీ నిర్వహించిన బిడ్డింగ్​లో మెస్సర్స్ జయప్రకాశ్ వెంచర్స్ లిమిటెడ్ మూడు ప్యాకేజీలను దక్కించుకుంది. రెండేళ్లపాటు రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు ఈ బిడ్డింగ్ ను నిర్వహించారు. ఇసుక వేలం ద్వారా ఏడాదికి రూ.765 కోట్ల ఆదాయం రానున్నట్టు ప్రభుత్వం తెలియజేసింది.

ఇసుక తవ్వకాలకు సంబంధించిన విధానాల్లో మార్పులు చేసింది.. రాష్ట్ర ప్రభుత్వం. ఇసుక రీచ్​ల్లో తవ్వకాల బాధ్యతను ఓ ప్రైవేటు కంపెనీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్​టీసీ ద్వారా నిర్వహించిన బిడ్డింగ్​లో ప్రైవేటు నిర్మాణ రంగ సంస్థ మెస్సర్స్ జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ రీచ్​లను దక్కించుకుంది. ప్రస్తుతం ఉన్న ఇసుక రీచ్ లను మూడు ప్రాంతాలుగా ప్యాకేజీలుగా విడగొట్టిన ప్రభుత్వం.. ఎంఎస్​టీసీ ద్వారా వేలం నిర్వహించింది. ఈ బిడ్డింగ్​లో తొలిస్థానంలో నిలిచిన జయప్రకాశ్ వెంచర్స్ మూడు ప్యాకేజీలనూ దక్కించుకుంది.

టెండర్లను దక్కించుకున్న జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్

ఇసుక తవ్వకాలు, నిల్వ, విక్రయాల టెండర్లను జేపీ గ్రూప్‌లో భాగమైన జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ అనే ప్రైవేటు సంస్థ దక్కించుకుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలు జోన్‌-1గా, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు జోన్‌-2గా, నెల్లూరు, రాయలసీమ జిల్లాలు కలిపి జోన్‌-3గా విభజించారు. వీటిలో మొత్తం 471 రీచ్‌లలో రెండేళ్లపాటు ఇసుక తవ్వకాలు, విక్రయాలకు టెండర్లు నిర్వహించే బాధ్యత కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీకి అప్పగించారు. ఆ సంస్థ నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో 5 ప్రైవేటు సంస్థలు బిడ్లు వేశాయి. వీటిలో అత్యధికంగా ప్యాకేజీ-1లో రూ.477.5 కోట్లు, ప్యాకేజీ-2లో రూ.745.7 కోట్లు, ప్యాకేజీ-3లో 305.6 కోట్లు (మొత్తం రూ.1,528 కోట్లు) ఇస్తామని జయప్రకాశ్‌ పవర్‌ కోట్‌ చేసి ఎల్‌-1గా నిలిచింది. దీంతో ఈ సంస్థకు మూడు ప్యాకేజీలను ఖరారు చేశారు. ఈ సంస్థ ఏప్రిల్‌ ఒకటి నుంచి రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలు చేపట్టనుంది.

నేరుగ ఇసుక నాణ్యత పరిశీలించుకునే అవకాశం

నిర్ధరించిన రీచ్‌ల వద్దే స్టాక్‌యార్డ్‌ ఏర్పాటు చేస్తుండటంతో వినియోగదారులు నేరుగా ఇసుక నాణ్యతను పరిశీలించుకుని, నచ్చిన రీచ్‌ వద్దే డబ్బు చెల్లించి ఇసుకను కొనుగోలు చేసే అవకాశముందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అధిక ధరలకు విక్రయిస్తున్నారనే అనుమానం కలిగితే వెంటనే ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసేందుకు కూడా వీలుందని గనుల శాఖ తెలియజేసింది. ఇసుక సరఫరా విషయంలో రవాణా గుత్తేదారులు, మద్యదళారీల ప్రమేయం ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సొంతగా వాహనం ఏర్పాటు చేసుకోలేని వారికి రవాణా గుత్తేదారు ద్వారా ఇసుకను తీసుకువెళ్ళే అవకాశం కల్పించారు. ఇకపై పట్టాభూముల్లో ఇసుక తవ్వకాలకు ఎటువంటి అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.


ఆన్‌లైన్‌ బుకింగ్‌ ఉండదు..నచ్చింది ఎంచుకోవచ్చు

  • ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాల్సిన అవసరం లేకుండా, రీచ్‌ వద్ద ఏర్పాటు చేసే యార్డుకు వెళ్లి నచ్చిన ఇసుకను ఎంపిక చేసుకోవచ్చు.
  • అవసరమైన మేర ఇసుకకు డబ్బులు చెల్లించి, సొంతంగా సమకూర్చుకున్న వాహనంలో తీసుకెళ్లవచ్చు.
  • వాహనం సమకూర్చుకోలేని వారికి గుత్తేదారు సంస్థ అదనపు మొత్తం తీసుకొని రవాణా సదుపాయం కల్పిస్తుంది.
  • రాష్ట్రమంతా అన్ని రీచ్‌లో ఒకే ధర ఉంటుంది. అయితే రీచ్‌లు లేనిచోట్ల ఇసుక యార్డులో నిల్వ ఉంచి విక్రయిస్తారు. ఇటువంటి యార్డుకు, రీచ్‌ నుంచి ఇసుకను తరలించినందుకు ఎంత వ్యయమవుతుందో, ఆ మేరకు దూరాన్ని బట్టి అదనపు ధర ఉంటుంది. ఇప్పటివరకైతే టన్నుకు రూ.350 తీసుకుంటున్నారు. ప్రైవేటు సంస్థకు గరిష్ఠంగా రూ.450 వరకు విక్రయించుకునే అవకాశం ఇవ్వవచ్చని తెలిసింది.
  • ఇకపై పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు చేయబోరు. కేవలం నదుల్లోని ఓపెన్‌ రీచ్‌ల్లో తవ్విన ఇసుక మాత్రమే విక్రయిస్తారు.
  • రాష్ట్రంలో ఏటా రెండు కోట్ల టన్నుల ఇసుక విక్రయాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
  • ఎక్కడైనా అధిక ధరకు ఇసుక విక్రయిస్తే ఫిర్యాదు చేసేందుకు ఫోన్‌ నంబర్లను అందుబాటులోకి తీసుకొస్తారు.

ఏటా రూ.765 కోట్ల ఆదాయం
ప్రస్తుతం అమల్లో ఉన్న ఇసుక విధానం ద్వారా 2019-20లో రూ.161.30 కోట్లు, ప్రస్తుత 2020-21లో ఫిబ్రవరి వరకు రూ.380 కోట్లు ప్రభుత్వానికి నికర ఆదాయం వచ్చిందని గనులశాఖ సంచాలకులు వీజీ వెంకటరెడ్డి శనివారం తెలిపారు. కొత్త సంస్థ ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.765 కోట్ల ఆదాయం లభిస్తుందన్నారు. ఏపీఎండీసీ నుంచి వెంటనే కొత్త సంస్థకు బాధ్యతలు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు: తెరాస అభ్యర్థి వాణీదేవి గెలుపు!

Last Updated : Mar 21, 2021, 7:36 AM IST

ABOUT THE AUTHOR

...view details