రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు పక్రియ జోరందుకుంది. వీటి కోసం ఏర్పాటైన రాష్ట్ర స్థాయి కమిటీ, ఉప సంఘాలు, జిల్లా కమిటీల చర్యలు క్రమేణా వేగం పుంజుకుంటున్నాయి. ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రకటిస్తామని.. 25 లేదా 26 జిల్లాలు ఏర్పాటు చేస్తామని గతేడాది ఆగస్టులో ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు జనవరి నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు కావచ్చన్న సూచనలతో.. వాటికి అవసరమైన మౌలిక సదుపాయాలపై అధికారులు చర్చిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, ఇతర భవనాలు, ప్రధాన రహదారుల వివరాలను సేకరిస్తున్నారు. ప్రభుత్వ భవనాలు లేకపోతే తాత్కాలికంగా ప్రైవేటు భవనాల్లో ఏర్పాటు చేయడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నారు. తాత్కాలిక, మధ్యకాలిక, శాశ్వత ప్రణాళికలతో నివేదికలు రూపొందిస్తున్నారు.
విశాఖలో...
విశాఖ జిల్లాలో ప్రతిపాదిత అనకాపల్లి జిల్లాకు కలెక్టరేట్‌ను అనకాపల్లిలోనే ఏర్పాటు చేయాలని భావిస్తుండగా .. అరకు జిల్లా కేంద్రాన్ని పాడేరులో పెట్టాలని ప్రాథమికంగా నిర్ధారించారు. అనకాపల్లి, పాడేరులలో జిల్లా కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన భూముల కోసం అన్వేషణ మొదలైంది. ఇటీవలే అనకాపల్లిలోని తుమ్మపాల చక్కెర కర్మాగారం భూములను అధికారులు పరిశీలించారు. కొత్తూరులో నిర్మిస్తున్న ఆర్డీవో కార్యాలయాన్ని సందర్శించి అక్కడున్న భూమి అందుబాటుపై జిల్లా యంత్రాంగం ఆరా తీసింది.
తూర్పుగోదావరిలో....
తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం అరకు లోక్‌సభ నియోజకవర్గంలో ఉంది. అది వేరే జిల్లాలోకి వెళ్లే అవకాశం ఉంది. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం కొత్త జిల్లాలవుతాయి. రెవెన్యూ డివిజన్లు 7, పోలీసు సబ్ డివిజన్లు 6 ఉండడం వల్ల.. కొత్త జిల్లాల్లో వీటిని సమానంగా ఏర్పాటు చేయడానికి కసరత్తు మొదలుపెట్టారు. రంపచోడవరం, చింతూరు ఐటీడీఏలు వేరే జిల్లాలకు వెళ్లే అవకాశం ఉంది. రాజమహేంద్రవరంలో సబ్ కలెక్టరేట్‌ను కలెక్టరేట్‌గా చేయడంగానీ.. ధవళేశ్వరం జల వనరులశాఖ అతిథి గృహం వద్ద కొత్త భవనం నిర్మించడం గానీ చేస్తారని భావిస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో....
పశ్చిమగోదావరి జిల్లాకు ఏలూరులో కలెక్టరేట్ ఉంది. నరసాపురం సబ్ కలెక్టరేట్‌ను కలెక్టరేట్‌గా మార్చుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం నరసాపురంలో ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలనూ అధికారులు పరిశీలిస్తున్నారు. జిల్లాలో రెవెన్యూ డివిజన్లు, పోలీస్ సబ్ డివిజన్లు సమానంగా ఉన్నాయి. అయితే కొవ్వూరు రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గంలో ఉండడం వల్ల మార్పులు జరిగే అవకాశముంది.
విజయవాడ, మచిలీపట్నంలో....
విజయవాడ బందరు రోడ్డులోని ఆర్‌అండ్‌బీ భవనాన్ని కలెక్టరేట్‌గా మార్చాలని చూస్తున్నారు. ఈ భవనంలో ఇప్పటికే ఉన్న రాష్ట్ర కార్యాలయాలను తరలించే వరకు.. సబ్ కలెక్టరేట్ సముదాయాన్ని కలెక్టరేట్‌గా మార్చాలని భావిస్తున్నారు. మచిలీపట్నంలో ప్రభుత్వ కార్యాలయాలున్నాయి.