దేశీయంగా తయారైన విదేశీ మద్యం, విదేశాల్లో తయారైన మద్యం బ్రాండ్లు ధరల్ని సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 180 మిల్లీ లీటర్ల పరిమాణం బాటిల్ ధర 120 రూపాయలకు మించని బ్రాండ్లకు... సైజుల వారీగా 30 నుంచి 120 రూపాయలు వరకూ తగ్గించినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. క్వార్టర్ బాటిల్ ధర 120 నుంచి 150 రూపాయల మధ్యలో ఉన్న బ్రాండ్లకు... 60 ఎంఎల్ నుంచి 750 ఎంఎల్ వరకూ 30 నుంచి 280 చొప్పున తగ్గించినట్లు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. క్వార్టర్ బాటిల్ ధర 150 నుంచి 190 రూపాయల మధ్యలో ఉన్న బ్రాండ్లకు ధరల్లో ఎటువంటి మార్పూ లేదని స్పష్టం చేశారు.
సైజులవారీగా ధరల పెంపు..
క్వార్టర్ 190 రూపాయల నుంచి 210కి మించి ధర ఉన్న బ్రాండ్లకు సైజులవారీగా 40 నుంచి 300 రూపాయల వరకూ పెంచారు. 210 నుంచి 290 రూపాయల ధర ఉన్న బ్రాండ్లకు సైజులవారీగా 40 నుంచి 340 వరకూ పెంచినట్లు జీవోలో పేర్కొన్నారు. క్వార్టర్ ధర 290 నుంచి 360 మధ్యలో ఉన్న బ్రాండ్లకు పరిమాణం వారీగా 60 నుంచి 470 రూపాయల వరకూ పెంచారు. క్వార్టర్ బాటిల్ ధర 600 రూపాయలు అంతకంటే ఎక్కువ ఉంటే... 140 నుంచి 1320 రూపాయల వరకూ ధర పెంచుతూ ఆదేశాలు వెలువడ్డాయి. అన్ని బ్రాండ్ల బీర్ బాటిళ్లపై 30 రూపాయలు తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రెడీ టూ డ్రింక్ లూజ్ మద్యంపై 30 రూపాయల మేర తగ్గింపు వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.