ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Employees Union Meets Sajjala: "పీఆర్‌సీపై సీఎం ఆ రోజే నిర్ణయం తీసుకుంటారు"

Employees Union Meets Sajjala : పీఆర్సీ, ఇతర డిమాండ్లపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సజ్జల చెప్పారని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. తమ సమస్యలపై ఇవాళ సజ్జలతో చర్చించిన నేతలు.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉద్యమాన్ని పూర్తిగా విరమించలేదని.. ప్రభుత్వానికి అవకాశం ఇచ్చేందుకు తాత్కాలికంగా వాయిదా వేశామని చెప్పారు.

Employees Union Meets Sajjala:
Employees Union Meets Sajjala:

By

Published : Dec 17, 2021, 7:02 PM IST

Updated : Dec 18, 2021, 4:29 AM IST

Employees Union Meets Sajjala: ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ఫిట్‌మెంట్‌ ఎంత శాతం ఉండబోతుందనే దానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. గత కొన్ని రోజులుగా ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నా ప్రతిష్టంభనే కొనసాగుతోంది. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డితో శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సారాంశం, ఉద్యోగుల ఫిట్‌మెంట్‌ డిమాండ్‌పై చర్చించారు. అనంతరం ఉద్యోగ సంఘాలతో సజ్జల రామకృష్ణారెడ్డి మరోమారు మాట్లాడినప్పుడూ ఫిట్‌మెంట్‌పై సందిగ్ధతే నెలకొంది. ఉద్యోగ సంఘాలు ఫిట్‌మెంట్‌ను 55 శాతం ఇవ్వాలని, పీఆర్సీ కమిషనర్‌ ఆశుతోష్‌ మిశ్రా నివేదికను యథావిధిగా అమలు చేయాలని డిమాండ్‌ చేశాయి. కమిషనర్‌ సిఫార్సు చేసిన 27 శాతం ఫిట్‌మెంట్‌పై అదనంగా ఎంత ఇస్తారో చెప్పాలని పేర్కొంటున్నాయి. ప్రభుత్వం మాత్రం ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఆర్థిక పరిస్థితులు బాగోలేనందున అంత మొత్తం ఇవ్వలేమని ఉద్యోగ సంఘాల నేతలకు సజ్జల వెల్లడించారు. పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై సీఎం జగన్‌తో సోమవారం అధికారులు సమావేశం కానున్నారు. తదుపరి ఉద్యోగ సంఘాలతో సీఎం సమావేశం ఉంటుందా? లేదా? అనేదానిపైనా స్పష్టత రాలేదు.

అధికారుల కమిటీ సిఫార్సులను వ్యతిరేకిస్తున్నాం: బండి శ్రీనివాసరావు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఆధ్వర్యంలోని కార్యదర్శుల కమిటీ ఇచ్చిన పీఆర్సీ సిఫార్సులను వ్యతిరేకిస్తున్నామని ఏపీ ఐకాస అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. ‘ఆ సిఫార్సులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు. పీఆర్సీపై అశితోష్‌ మిశ్ర కమిటీ నివేదికను యథాతథంగా అమలు చేయాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి విన్నవించాం. సీఎం జగన్‌తో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామని సజ్జల చెప్పారు. పీఆర్సీపై సీఎం జగన్‌ సోమవారం చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకుంటారు. పీఆర్సీ ఫిట్‌మెంట్‌ 55 శాతం ఇవ్వాలని కోరాం. దీంట్లో రాజీపడడం లేదు. 14.29 శాతం ఫిట్‌మెంట్‌ను వ్యతిరేకిస్తున్నాం. ఉద్యోగుల 70 డిమాండ్లపై సీఎస్‌ బుధవారం అందరూ అధికారులను పిలిపించి, చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటారు’ అని వెల్లడించారు.

ఉద్యమాన్ని పూర్తిగా విరమించలేదు: బొప్పరాజు వెంకటేశ్వర్లు

ద్యమాన్ని విరమించలేదని, తాత్కాలికంగా వాయిదా వేశామని ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఉద్యమాన్ని ఎవరికి చెప్పి విరమించుకున్నారని సామాజిక మాధ్యమాల్లో కొందరు పోస్టులు పెడుతున్నారన్నారు. ‘ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమే ఉద్యమం. సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం ముందుకొచ్చింది. వీటిలో ఆర్థికపరమైనవి ఎక్కువ ఉంటాయి. ఆర్థిక శాఖ మంత్రే ముందుకొచ్చి, వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 60 ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి వచ్చే బుధవారం అధికారులతో సమావేశం నిర్వహిస్తామని సీఎస్‌ చెప్పారు. పీఆర్సీ ప్రకటనకు మా ఉద్యమం అడ్డు కారాదనే దాన్ని తాత్కాలికంగా నిలిపివేశాం. అధికారుల కమిటీ చెప్పినదాన్ని మేం అంగీకరించే ప్రసక్తే లేదు. 14.29 శాతం ఫిట్‌మెంట్‌ అంటే ఉద్యోగుల్లో తీవ్ర అభద్రతాభావం పెరుగుతుంది. మాకు పీఆర్సీ కమిషనర్‌ 27 శాతంతో తయారుచేయించిన మాస్టర్‌ స్కేలును యథాతథంగా ఉంచాలి. దానిపై ఫిట్‌మెంట్‌ ఎంతిస్తారో ఇవ్వాలని కోరాం. అధికారులతో సీఎం జగన్‌ సోమవారం చర్చిస్తారు. ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఉద్యోగ సంఘాలతో సమన్వయం చేసేందుకు సీఎం కార్యాలయంలో ఒకరికి బాధ్యత అప్పగిస్తామన్నారు. పీఆర్సీ కమిటీ నివేదికకు, అధికారుల కమిటీ సిఫార్సుకు మధ్య చాలా అంతరం ఉంది. ఉద్యోగులు నష్టపోకుండా పీఆర్సీ అమలు చేయాలి’ అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి :

CBN On Amaravati Capital: అమరావతి ఏ ఒక్కరిదో కాదు.. ప్రజా రాజధాని: చంద్రబాబు

Last Updated : Dec 18, 2021, 4:29 AM IST

ABOUT THE AUTHOR

...view details