రాష్ట్రంలో 18 ఏళ్లు దాటి 45 సంవత్సరాలలోపు ఉన్న వారు 2,04,70,364 మంది ఉన్నారు. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందించాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్రం నుంచి తదుపరి మార్గదర్శకాలు అనుసరించి వీరికి టీకాల పంపిణీ ఎలా అన్న దానిపై స్పష్టత వస్తుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో సుమారు 48 లక్షల మందికి టీకా పంపిణీ చేశారు. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు పైబడిన వారు, ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు కలిపి 3,48,34,227 మంది ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య సిబ్బంది 4.90 లక్షల మంది ఉన్నారు. వీరిలో 82% మంది తొలి డోసు, 3 లక్షల మంది చొప్పున రెండో డోసు పొందారు.
తేలిన లెక్కలు... మే ఒకటి నుంచి వ్యాక్సినేషన్
కేంద్ర ప్రభుత్వం మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన వారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించడంతో... అధికారులు అర్హుల లెక్కలు తేల్చారు. 18 నుంచి 45 సంవత్సారాలు వయస్సు గల వారు రాష్ట్రంలో 2 కోట్లకు పైనే ఉన్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి వారికి టీకా ఇవ్వనున్నారు.
ఫ్రంట్‌లైన్ వర్కర్స్ కేటగిరి లో 8.10 లక్షల మంది ఉన్నారు. వీరిలో 63% మంది తొలి డోసు, 3.20 లక్షల మంది రెండో డోసు తీసుకున్నారు .1.33 కోట్ల మంది 45 నుంచి 59 సంవత్సరాలలోపు ఉన్న వారు ఉన్నారు. వీరిలో తొలి డోసు ఇప్పటివరకు 32 లక్షల మంది పొందారు. వీరిలో రెండో డోసు పొందిన వారిలో సుమారు 1.30 లక్షల మంది ఉన్నారు.45 నుంచి 60 సంవత్సరాల మధ్యన ఉన్న వారు 82.05 లక్షల మంది ఉన్నారు. 15.48 లక్షల మంది తొలి డోసు, రెండో డోసును సుమారు 75 వేల మంది పొందారు. 60 సంవత్సారాలకు పైన 51 లక్షల మంది ఉన్నారు. వీరిలో తొలి డోసు 16.50 లక్షలు, రెండో డోసును 75 వేల మంది చొప్పున పొందారు. రాష్ట్రానికి నేడు మరో రెండు లక్షల వ్యాక్సిన్ రానుంది. ప్రస్తుతం రెండు లక్షల వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. గత రెండు రోజులుగా ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు మాత్రమే టీకాలు వేశారు. బుధవారం టీకా పంపిణీలోనూ వీరికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ఇదీ చదవండి:వాలంటీరే.. అప్పుడప్పుడు ఉన్నతాధికారుల్లా అవతారమెత్తుతాడు!