రాజధాని తరలింపు అంశంపై మరింత అధ్యయనం చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. జీఎన్ రావు కమిటీ నివేదికపై చర్చించేందుకు ప్రత్యేకంగా సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి మరికొన్ని ఇతర అంశాలపై సైతం చర్చించి నిర్ణయం తీసుకుంది. బోస్టన్ కన్సల్టింగ్ కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేసిన సర్కారు.. జనవరి 3న నివేదిక అందుకోనుంది. జీఎన్ రావు కమిటీ నివేదికతో కలిపి ఈ కమిటీ చెప్పిన వివరాలను అధ్యయనం చేసి తుది నిర్ణయం తీసుకోనుంది. ఇందుకోసం మంత్రులు, అధికారులతో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్నినాని వివరించారు. రాజధాని ప్రకటన చేసే ముందు రైతుల అభిప్రాయాలు విన్నాకే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కేబినెట్ నిర్ణయాలివే..
⦁ స్థానిక సంస్థల ఎన్నికల కోసం రిజర్వేషన్ల ఖరారు.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మొత్తంగా 59.5 శాతం రిజర్వేషన్లు
⦁ 2020 మార్చి లోగా రూ.130 కోట్లతో కొత్త 108, 104 వాహనాల కొనుగోలుకు కేబినెట్ ఆమోదం
⦁ రాష్ట్ర వ్యాప్తంగా 341 వ్యవసాయ ఉత్పత్తుల శాశ్వత కొనుగోలు కేంద్రాలను నడపాలని నిర్ణయం
⦁ కనీస మద్దతు ధరకు నోచుకోని పసుపు, ఉల్లి, మిర్చి, చిరు ధాన్యాల కొనుగోలుకు ఆమోదం
⦁ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీపెట్కు కృష్ణా జిల్లా సూరంపల్లిలో 6 ఎకరాల భూమిని ఎకరా లక్ష చొప్పున కేటాయించేందుకు నిర్ణయం