ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నూతన ఇసుక విధానానికి ఆమోదం... పంపిణీ నుంచి తప్పుకోనున్న ప్రభుత్వం... - ఏపీలో ఇసుక విధానం అప్ డేట్స్

నూతన ఇసుక విధానానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రీచ్​లను ఒకే సంస్థకు అప్పగించాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు రీచ్‌లను అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ముందుకు రాకపోతే బహిరంగ వేలం వేయాలని కేబినెట్ నిర్ణయించింది.

ap Cabinet approves new sand policy
ap Cabinet approves new sand policy

By

Published : Nov 5, 2020, 1:12 PM IST

Updated : Nov 6, 2020, 7:09 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక వెలికితీత, సరఫరా బాధ్యతలను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు అప్పజెప్పాలని, వారు కాదంటే బహిరంగ వేలం ద్వారా ప్రైవేటుకే ఆ బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఇసుక విధానాన్ని మార్చాలని మంత్రిమండలి తీర్మానించింది. ఇసుక విధానంపై మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. వెలగపూడి సచివాలయంలో గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశమైంది.

ఇసుక తవ్వకం, నిల్వ, అమ్మకాలను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు అప్పజెప్పాలని నిర్ణయించారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఎన్‌ఎండీసీ (కేంద్ర ఖనిజాభివృద్ధి సంస్థ) సహా మరో 8 సంస్థలను సంప్రదిస్తున్నారు. కేంద్రసంస్థలు అందుబాటులో లేకపోతే, బహిరంగ వేలం ద్వారా ప్రైవేటుసంస్థలకు ఆ బాధ్యతలు అప్పగిస్తారు. రాష్ట్రంలో జిల్లాల వారీగా ఇసుక రీచ్‌లను 3 మండలాలుగా విభజిస్తారు.

మండలం 1: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి

మండలం 2:పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం

మండలం 3: నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు

  • షెడ్యూలు ప్రాంతంలోని ఇసుక రీచ్‌లను గిరిజన సంస్థలకే కేటాయించి తవ్వకాలు చేపట్టాలి.
  • రీచ్‌ల నుంచే తవ్వకాలు చేపట్టాలి. పట్టా భూముల్లో తవ్వకాలకు వీల్లేదు.
  • రీచ్‌ల వద్ద అమ్మకం ధరను ఫ్రీజ్‌ చేస్తారు. దానికి మించి అధిక ధరకు అమ్మకూడదు.
  • వినియోగదారులు తమ సొంత వాహనాల్లోనూ ఇసుకను తెచ్చుకోవచ్చు. కాంట్రాక్టరు కనీసం 20 వాహనాలను నిల్వ కేంద్రం వద్ద ఉంచాలి. అవసరమైతే వాటిని వినియోగదారులు ఉపయోగించుకుంటారు.
  • ఇసుక అమ్మకాలను ఆఫ్‌లైన్‌లో కొనసాగించాలి. వినియోగదారులు తమకు నచ్చిన రీచ్‌లో నాణ్యతను పరీక్షించుకుని ఇసుక కొనుక్కోవచ్చు.
  • నదుల పక్కనున్న గ్రామాల ప్రజలు తమ అవసరాలకు ఎడ్లబండ్ల ద్వారా ఉచితంగా ఇసుక తెచ్చుకునే వెసులుబాటు ఇకముందూ కొనసాగుతుంది. ఇసుక సరఫరా బాధ్యత చేపట్టే సంస్థలు తవ్వకం, నిల్వ, అమ్మకాల్లో ప్రభుత్వ నియమ, నిబంధనలను కచ్చితంగా పాటించాలి. అర్ధంతరంగా ఒప్పందాన్ని రద్దుచేసుకున్నా లేక నియమ నిబంధనలు పాటించకపోయినా ఆ సంస్థ పూర్తి బాధ్యత వహించాలని, అందుకు పరిహారం చెల్లించాలని కూడా వెల్లడించారు.

ఎస్‌ఈబీకి మరిన్ని అధికారాలు

మద్యం, ఇసుక అక్రమ రవాణా నిరోధం కోసం ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ)కి మరిన్ని అధికారాలు కల్పించాలని మంత్రిమండలి నిర్ణయించింది. గ్యాంబ్లింగ్‌, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, మట్కాలతో పాటు నార్కోటిక్స్‌, గంజాయి వంటి మత్తు పదార్థాలను అరికట్టడం, గుట్కా తయారీ, అమ్మకాలను అరికట్టడంతో పాటు ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టే బాధ్యతను ఈ బ్యూరోకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం డిప్యుటేషన్‌పై 30 మందిని ఇవ్వాలని నిర్ణయించారు. పొరుగుసేవల విధానంలో 76 పోస్టులు ఇవ్వనున్నారు.

ఇదీ చదవండి: మందడంలో ఉద్రిక్త వాతావరణం

Last Updated : Nov 6, 2020, 7:09 AM IST

ABOUT THE AUTHOR

...view details