రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వం నిధుల వేట చేపట్టింది. ఇందుకోసం... బిల్డ్ ఆంధ్రప్రదేశ్ మిషన్‌ను రూపొందించింది. ఇటీవల నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో బిల్డ్ ఏపీ మిషన్‌ను ఆమోదించింది. ఈ మిషన్ ద్వారా... రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా, నిరుపయోగంగా ఉన్న భూములను గుర్తించి విక్రయించనున్నారు. ఈ మేరకు కేంద్ర సంస్థ అయిన... నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌తో త్వరలోనే ఎంవోయూ కుదుర్చుకోనుంది.
ప్రభుత్వం తరపున అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు... బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు అనుమతి ఇస్తూ... ఆదేశాలు జారీ అయ్యాయి. ఎన్‌బీసీసీతో ముసాయిదా ఒప్పందాన్ని ఆమోదిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎన్‌బీసీసీతో ఒప్పందం ద్వారా... రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూముల్లో రహదారి, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. అనంతరం వాటిని విక్రయించి నిధులు సమీకరించనున్నారు. ఆ నిధులను... నవరత్నాలు, నాడు-నేడు అమలు, మౌలిక వసతుల కల్పనకు సర్కారు వినియోగించనుంది.