పంటల దిగుబడి పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి కన్నబాబు తెలిపారు. వచ్చే ఖరీఫ్ నుంచి రైతు భరోసా కేంద్రం ద్వారా మెరుగైన విత్తనాలను రైతులకు పంపిణీ చేస్తామన్నారు. రైతు సంక్షేమం గురించి నిరంతరం ఆలోచిస్తున్న నాయకుడు సీఎం జగన్ అని ప్రశంసించారు. క్షేతస్థాయిలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులతో మాట్లాడి వారి సందేహలను నివృత్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతును కాపాడుకుంటే...రాష్ట్రాన్ని కాపాడుకున్నట్టేనని అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్ పొలం బడి కార్యక్రమం ద్వారా వ్యవసాయం చేసేలా రైతులకు అవసరమైన శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. పశువుల యాజమానులకు గుర్తింపు కార్డు ఇవ్వనున్నామని తెలిపారు. ఈ-క్రాఫ్ బుకింగ్ ద్వారా రైతులకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. గ్రామాల్లోనూ రైతులు సాంకేతికతను వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు.
లైవ్ అప్డేట్స్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు
18:41 January 21
రైతు భరోసా కేంద్రం ద్వారా విత్తనాలు పంపిణీ: మంత్రి కన్నబాబు
16:07 January 21
నాణ్యమైన విద్యకు నాలుగు అడుగులు: సీఎం జగన్
దేశంలో నిరక్షరాస్యతతో పోల్చితే... రాష్ట్రంలో ఎక్కువుందని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం నాలుగు అడుగులు వేసిందన్నారు. అమ్మఒడి, మిడ్ డే మీల్స్, ఆంగ్లమాధ్యమం, నాడు-నేడు
అమ్మఒడి:
* ఈ పథకం ద్వారా జనవరి 9 న 6 వేల 28 కోట్ల రూపాయలను తల్లుల బ్యాంక్ ఖాతాలో వేశామన్నారు.
ఒకవైపు తల్లుల్లో చైతన్యం కలిగిస్తూనే... మరోవైపు పిల్లల హాజరును పెంచేలా చర్యలు తీసుకోనున్నామని సీఎం తెలిపారు.
ఈ రోజు నుంచి మిడ్ డే మీల్స్‌లో మార్పులు(జగనన్న గోరుముద్ద)
* ప్రతి రోజు పిల్లలకు ఎలాంటి ఆహారాన్ని అందిస్తున్నారో ఎప్పటికప్పుడు సమీక్షించే పథకం.
* ఆయాలకు ఇస్తోన్న వేయి రూపాయలను మూడు వేలకు పెంచుతూ నిర్ణయం.
* నాణ్యమైన భోజనం అందించేలా ప్రతి స్కూల్ల్లోనూ పేరేంట్స్ కమిటీ, సెల్ప్ హెల్ప్ గ్రూప్ భాగస్వామ్యం.
* పిల్లలకు గుడ్లను అందించడంలో అవినీతిని నిర్మూలించాలనే ఉద్దేశంతో రివర్స్ టెండరింగ్ నిర్వహించేలా చర్యలు.
ఆంగ్లమాధ్యమం
* ఈ ఏడాది ఒకటి నుంచి ఆరోతరగతి వరకు ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టనున్నాం.
* అత్యాధునిక విధానాలతో పిల్లలకు నాణ్యమైన విద్య. ఇందులో భాగంగానే సింగపూర్ గవర్నమెంట్‌తో చర్చ
నాడు-నేడు
* ప్రతి పాఠశాలల్లోనూ తొమ్మిది రకాల మౌలిక వసతులు కల్పన
జగనన్న విద్యాకానుక
ప్రతి విద్యార్థికి కిట్ ఇవ్వనున్నాం. ఇందులో విద్యార్థికి అవసరమైన యూనిఫాం, సాక్సులు వంచి అన్ని రకాల వసతులు అందజేత
* వసతి దీవెన,విద్యాదీవెన పథకాలను ప్రారంభించనున్నాం
* ప్రతి పిల్లాడి తల్లి ఖాతాలో వసతి దీవెన కింద సంవత్సరానికి 20 వేల రూపాయలు వేయనున్నాం
16:00 January 21
సీఎం జగన్ దూరదృష్టి పాలకుడు: రమేష్
సీఎం జగన్ దూరదృష్టి ఉన్న పాలకుడని వైకాపా ఎమ్మెల్యే రమేశ్ ప్రశంసించారు. తారతమ్యాలు, భేదాభిప్రాయాలు లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. అమరావతిలో ఆధార్ కార్డు ఉందా అని చంద్రబాబుని ప్రశ్నించారు.
15:51 January 21
'అమ్మఒడి'తో ప్రతి తల్లి కళ్లలో ఆనందం కనిపిస్తోంది: వేణుగోపాల్
ప్రతి సంక్షేమ పథకంలోనూ ప్రజలను మమేకం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే వేణుగోపాల్ పేర్కొన్నారు. సీఎం జగన్ తీసుకున్న ఆంగ్లమాధ్యమం నిర్ణయాన్ని హర్షించదగిందన్నారు. అమ్మఒడి పథకం ద్వారా ప్రతి తల్లి కళ్లలో ఆనందం కనిపిస్తోందన్నారు.
15:43 January 21
'అమ్మఒడి'తో ప్రతి చిన్నారికీ సీఎం జగన్ మేనమామయ్యారు: ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్
పార్టీలకతీతంగా, రాజకీయాలకతీతంగా అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు.
ప్రతి ఒక్క చిన్నారికీ మేనమామగా అమ్మఒడి పథకం ద్వారా సీఎం జగన్ దగ్గరయ్యారన్నారు.
14:56 January 21
సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు: ఉండవల్లి శ్రీదేవి
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని పరిపాలన, అభివృద్ధి వికేంద్రికరణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు. అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టడం చాలా అనందంగా ఉందని అన్నారు. సీఎం జగన్ తను ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అన్నారు. ఆంగ్ల మాధ్యమ విద్యాబోధన విద్యార్థులకు మేలు చేస్తుందన్నారు.
14:03 January 21
అమ్మవడి పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు: మంత్రి పుష్ప శ్రీవాణి
అమ్మవడి పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి పుష్ప శ్రీవాణి. నిరుపేద విద్యార్థుల కోసం ఆలోచించి ఈ పథకాన్ని సీఎం ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రతీ పేద తల్లి తన బిడ్డకు పెద్ద చదువులు చదివే అవకాశాన్ని కల్పించారని అన్నారు.
13:52 January 21
అసెంబ్లీ నుంచి తెదేపా సభ్యులు వాకౌట్
అసెంబ్లీ నుంచి తెదేపా సభ్యులు వాకౌట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ నిధులు మళ్లించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెదేపా సభ్యులు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఎస్సీ వర్గీకరణ ప్రకారం కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్‌ను పట్టించుకోకపోవడంతో సభ నుంచి తెదేపా వాకౌట్ చేసింది. అనంతరం లాబీలో తెదేపా సభ్యులు నినాదాలు చేశారు.
13:19 January 21
అమ్మఒడిపై స్వల్పకాలిక చర్చ
జగన్ ప్రసంగం తర్వాత అమ్మఒడి పథకంపై స్వల్పకాలిక చర్చను మంత్రి కన్నబాబు ప్రారంభించారు. దేశంలోనే అత్యున్నత పథకమని ఆయన కొనియాడారు. శతశాతం అక్షరాస్యత సాధించాలని ఈ పథకాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారని తెలిపారు. ఇదో సంస్కరణగా అభివర్ణించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల్లోనే కాకుండా జూనియర్ కళాశాల్లోనూ దీన్ని ప్రవేశ పెట్టారని అన్నారు.
13:11 January 21
ఈ కార్పొరేషన్ల ద్వారా అందరికీ మంచి జరుగుతుంది: సీఎం జగన్
ఈ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ జరగని బిల్లు తీసుకొచ్చాం. వీళ్లను ఎప్పుడూ చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూశారు. ఎప్పుడూ మంచి చేయాలనే ఆలోచన వారికి రాలేదు. భవిష్యత్‌లో ప్రశ్నిస్తారనే ఆందోళనతోనే బిల్లును అడ్డుకుంటున్నారు. ఒకే ఎస్సీ సభ్యుణ్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం రాజకీయం చేస్తోంది. ఇలాంటి ఎమ్మెల్యేను సభకు ఎందుకు పంపించామని ఎస్సీలు బాధపడే పరిస్థితి వచ్చింది. ఎస్సీలకు మంచి చేసే బిల్లును అందరూ ఆమోదించాలని కోరుతున్నాను.
13:09 January 21
ఎస్సీ, ఎస్టీ కమిషన్ బిల్లును అడ్డుకున్నారు: సీఎం జగన్
చారిత్రాత్మక బిల్లును అడ్డుకున్నారు. మరింత శ్రద్ధతో ఎస్సీఎస్టీల కోసం పనిచేయాలని కమిషన్లు తీసుకురావాలని అనుకున్నాం. అలాంటి బిల్లును శాసన మండలిలో పాస్ కాకుండా అడ్డుకున్నారు.
12:34 January 21
ప్రత్యేక ఎస్సీ కమిషన్ బిల్లుకు సభ ఆమోదం
ప్రత్యేక ఎస్సీ కమిషన్ బిల్లును శాసనసభ ఆమోదించి. తెలుగుదేశం పార్టీ సభ్యుల నినాదాల మధ్యే ఈ బిల్లును సభ ఆమోదించింది.
12:28 January 21
ఎస్సీ వర్గీకరణ మా పరిధిలో లేదు: పినిపె విశ్వరూప్
వర్గీకరణ మన పరిధిలో లేదు. అందుకే ఈ బిల్లును ఆమోదించాలని కోరుతున్నాను: మంత్రి పినిపె విశ్వరూప్
ఎస్సీలకు ఖర్చు పెట్టి నిధులపై చర్చకు మేం సిద్ధం. మీరు సిద్ధమా : మంత్రి పినిపె విశ్వరూప్
12:25 January 21
తెలుగుదేశం సభ్యుల నినాదాల మధ్యే సభాకార్యకలాపాలు
తెలుగుదేశం సభ్యుల తీరుపై అసహనంతో వెళ్లిపోయిన కాసేపటి తర్వాత సభ ప్రారంభమైంది. మళ్లీ ప్రారంభమైనా తెలుగుదేశం సభ్యులు వెనక్కి తగ్గలేదు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఈ గందరగోళం మధ్యే అధికార పార్టీ సభ్యులు మాట్లాడుతున్నారు.
11:15 January 21
నేను ఇక్కడ ఉండను వెళ్లిపోతున్నా: స్పీకర్ తమ్మినేని
అసెంబ్లీలో ఎస్సీ కమిషన్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ జరుగుతోంది. తెదేపా నేతలు జై అమరావతి అని నినాదాలు చేశారు. సభను జరగనివ్వకుండా తెదేపా నేతలు అడ్డుపడుతున్నారని స్పీకర్ అన్నారు. ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలపై తాను మనస్తాపానికి గురవుతున్నానని చెప్పి సీటులోనుంచి లేచి వెళ్లిపోయారు.
11:14 January 21
ప్రత్యేక ఎస్సీ కమిషన్ బిల్లును సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం
మంత్రి విశ్వరూప్ ప్రత్యేక ఎస్సీ కమిషన్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అమరావతిలో తనకు భూములున్నాయని వైకాపా చేసిన ఆరోపణలపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రంగా స్పందించారు. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... గోరంట్ల ఝాన్సీ లక్ష్మిపేరుపై అమరావతిలో భూములు ఉన్నాయని, పూర్తి స్థాయిలో విచారణ జరిపి వివరాలు వెల్లడిస్తామని ప్రకటించారు.
11:02 January 21
3 రాజధానుల ప్రతిపాదనను అంతా స్వాగతిస్తున్నారు: రోజా
ప్రభుత్వం చేసిన 3 రాజధానుల ప్రతిపాదనను అంతా స్వాగతిస్తున్నారని.. వైకాపా ఎమ్మెల్యే రోజా అన్నారు. తెలుగుదేశం నాయకులు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. పాలనను వికేంద్రీకరించకుండా.. అభివృద్ధిని ఎలా వికేంద్రీకరస్తారో చెప్పాలని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలోపే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసిన ప్రభుత్వం జగన్ దే అని అన్నారు.
10:20 January 21
లైవ్ అప్డేట్స్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఏపీ శాసనసభ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. పలు బిల్లులకు శాసనసభ ఆమోదం తెలుపుతోంది. సభ మొదలవగానే.. తెదేపా ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.