మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి మరో అరుగురిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు(attack on tdp office case news). వీరిలో ముగ్గురు విజయవాడ వాసులు కాగా... మరో ముగ్గురు గుంటూరుకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు చెందిన 10 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. తాజాగా విజయవాడకు చెందిన జోగ రాజు, షేక్ బాబు, షేక్ సైదా, బంక సూర్యసురేష్, గుంటూరుకు చెందిన మోహన్ కృష్ణారెడ్డి, కాండ్రుకుంట గురవయ్యలను అదుపులోకి తీసుకున్నారు. మిగతా ముద్దాయిలను పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయం వెల్లడించింది. వీడియో క్లిప్పింగుల ఆధారంగా నిందితుల గుర్తింపు ప్రక్రియను పోలీసులు చేపట్టారు.
నిన్న పది మంది అరెస్ట్..
రాష్ట్రంలో సంచలనం రేపిన తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు శనివారం పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొందరు వైకాపా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అనుచరులు, విజయవాడకు చెందిన మరో వైకాపా నేత దేవినేని అవినాష్ సన్నిహితులని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. తాజాగా తాము వీరిని అదుపులోకి తీసుకున్నట్లు గుంటూరు అర్బన్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఆ పది మంది వీరే..
పానుగంటి చైతన్య, పల్లపు మహేష్ బాబు, పేరూరి అజయ్, శేషగిరి పవన్‌కుమార్, అడపాల గణపతి, గోక దుర్గాప్రసాద్ (గుంటూరు జిల్లా), షేక్ అబ్దుల్లా, కోమటిపల్లి దుర్గారావు, లంక అభినాయుడు, జోగ రమణ (విజయవాడ). ఇదే కేసులో జ్యోతిరాజా, షేక్‌సైదా, షేక్ బాబు అనే ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల తెదేపా కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిలో వీరు పాల్గొన్నట్లు సీసీటీవీ పుటేజి ఆధారంగా పోలీసులు గుర్తించి నోటీసులు జారీ చేశారు. మిగిలిన నిందితులను పట్టుకోవడానికి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సీసీటీవీ పుటేజి ఇవ్వాల్సిందిగా తెదేపా కార్యాలయానికి 91 సీఆర్‌పీసీ కింద నోటీసు జారీ చేశామని, అది రాగానే మిగిలినవారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి.. వీరిని రిమాండ్‌కు ఇవ్వాలని కోరలేదని, నోటీసులు ఇచ్చి ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరుకావాలని సూచించి పంపామని గుంటూరు అర్బన్ ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ ‘ఈనాడు’కు వివరించారు. ఆ రోజు జరిగిన విధ్వంసంలో వీరి పాత్ర గురించి సీసీటీవీ పుటేజిని విశ్లేషించాల్సి ఉందని, ఆ తర్వాతే రిమాండ్‌కు చర్యలు తీసుకుంటామని చెప్పారు.