ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేపటి నుంచే పగటి కర్ఫ్యూ.. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే దుకాణాలు - corona situations in ap

కరోనా వ్యాప్తి నివారణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాత్రి కర్ప్యూ అమలవుతోండగా.. ఆ వేళల్ని పెంచింది. బుధవారం నుంచి కర్ప్యూ తాజా ఆంక్షలు ప్రారంభమవుతాయి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే సాధారణ కార్యకలాపాలకు అనుమతివ్వాలని సీఎం ఆదేశించారు. రెండు వారాల పాటు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

partial curfew in ap
partial curfew for 14 days in ap

By

Published : May 3, 2021, 6:49 PM IST

Updated : May 4, 2021, 2:05 AM IST

రాష్ట్రంలో కొవిడ్‌ నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. రాష్ట్రంలో కొవిడ్‌ నియంత్రణకు పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తూ, ఆంక్షలు విధించాలని నిర్ణయించారు. ఒక వైపు ప్రజల దైనందిన అవసరాలు తీరేలా వెసులుబాటు కల్పిస్తూ.. మరోవైపు వ్యాపారులు, అన్ని వర్గాలకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. ఈ నెల 5 నుంచే పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తూ, ఆంక్షలు విధించనున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అన్ని దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇస్తారు.

అత్యవసర సేవలకే అనుమతి

ఆ తర్వాత కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం వరకు అన్ని షాపులు తెరిచిన సమయంలో 144 సెక్షన్‌ అమలు చేస్తారు. 5 గురికి మించి ఒకే చోట చేరకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు వారాల పాటు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఇప్పటి వరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ ఉండగా తాజా ఆదేశాల ప్రకారం.. బుధవారం నుంచి రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచే కర్ఫ్యూ మొదలవుతుంది.

కోవిడ్ చికిత్సపై..

జిల్లాల్లో ఆక్సిజన్‌ వసతి ఉన్న ఆస్పత్రులు 146 ఉండగా, వాటిలో ఆక్సిజన్‌ పైప్‌లైన్‌ ఉన్న బెడ్లు 26,446 అని అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పుడు రోజుకు సగటున 420 నుంచి 500 మెట్రిక్‌ టన్నుల వినియోగిస్తుండగా, ఈ నెల రెండో వారం చివరి నాటికి ఆ వినియోగం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి 480 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కేటాయించగా, రవాణాకు అవసరమైన ట్యాంకర్లు లేక అందులో 448 మెట్రిక్‌ టన్నులు మాత్రమే మనం తీసుకోగలుగుతున్నామని చెప్పారు.

ఆక్సిజన్‌ రవాణాతో పాటు, స్టోరేజీకి కూడా ట్యాంకర్ల అవసరం ఉందని అధికారులు వివరించారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కోటా పెంచాలని కేంద్రాన్ని కోరామని అధికారులు చెప్పారు. పెరంబుదూరు, బళ్లారి నుంచి చెరి 200 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ రవాణా చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అదే విధంగా రవాణా కోసం ట్యాంకర్లు ఇవ్వాలని కూడా కోరుతున్నామని చెప్పారు.

ఆక్సిజన్ కొరత రావొద్దు..

కొవిడ్‌ పాజిటివ్‌గా గుర్తించిన వారి ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించి, వారికి పక్కాగా పరీక్షలు నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ప్రభుత్వ ఎంప్యానెల్‌లో ఉన్న ఆస్పత్రుల్లోనూ వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది కొరత లేకుండా చూడాలని ఆయన సూచించారు. అన్ని ఆస్పత్రులలో రోగులకు సరిపడా ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచే విధంగా దిగుమతి చేసుకోవాలని చెప్పారు. దిగుమతి చేసుకున్న ఆక్సిజన్‌ను నిల్వ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఆ మేరకు ట్యాంకర్లు సేకరించాలని, ఏ ఆస్పత్రిలోనూ ఆక్సిజన్‌ కొరత లేకుండా చూడాలని ఆదేశించారు.

ఆస్పత్రుల్లో వసతులు.. వ్యాక్సినేషన్ వివరాలు...

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు, పరీక్షలు, వైద్య సేవలకు సంబంధించిన వివరాలపై సీఎం చర్చించారు. రాష్ట్రంలో నెలకు సగటున 3 లక్షల 10వేల 915 పరీక్షల చొప్పున ఇప్పటి వరకు మొత్తం 1 కోటి 66 లక్షల 2 వేల 873 పరీక్షలు నిర్వహించామని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 558 కొవిడ్‌ ఆస్పత్రులు ఉండగా, వాటిలో మొత్తం 44 వేల 599 బెడ్లు ఉన్నాయని చెప్పారు. వాటిలో 37,760 మంది కొవిడ్‌ చికిత్స పొందుతున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 81 కొవిడ్‌ కేర్‌ సెంటర్ల లో 41 వేల 780 బెడ్లు ఉండగా, వాటిలో నిన్నటి వరకు 9వేల 937 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు సీఎంకు తెలిపారు.

కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఇంకా 31 వేల 843 బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. బెడ్ల కోసం 104 కాల్‌ సెంటర్‌కు పెద్ద సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయని సీఎంకు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా మైలాన్‌ ల్యాబ్‌ నుంచి 8 లక్షల రెమిడ్​సివిర్ ఇంజెక్షన్ల కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చామని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడిన వారిలో ఇప్పటి వరకు 52 లక్షల మందికి తొలి విడత వాక్సిన్‌ ఇచ్చామన్నారు. ఇంకా 1 కోటి 33 లక్షల 7వేల 889 మందికి వాక్సిన్‌ ఇవ్వాల్సి ఉందని వివరించారు.

ఇదీ చదవండి

వైద్యారోగ్య శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి: సీఎం జగన్

Last Updated : May 4, 2021, 2:05 AM IST

ABOUT THE AUTHOR

...view details