ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం... కీలక నిర్ణయాలకు అవకాశం

రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. పలు సంక్షేమ పథకాలను ప్రకటించిన ప్రభుత్వం వాటి విధివిధానాలను ఖరారు చేయనుంది. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేలా నిర్ణయాలు తీసుకోబోతున్నారు. గ్రామ న్యాయాలయాల ఏర్పాటు దస్త్రంపైనా మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది.

మంత్రివర్గం సమావేశం

By

Published : Nov 13, 2019, 5:01 AM IST

Updated : Nov 13, 2019, 10:22 AM IST

సచివాలయంలో ఈ ఉదయం పదకొండున్నరకు మంత్రివర్గం సమావేశం కానుంది. ఇప్పటికే ప్రకటించిన కొన్ని పథకాలు ఎప్పటినుంచి అమలు చేస్తారనే విషయమై సమావేశం అనంతరం ప్రకటించనున్నారు. రాష్ట్రంలో ఇసుక సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఈనెల 14నుంచి వారోత్సవాలు నిర్వహించబోతోంది. ఈక్రమంలో ఇసుక అందరికీ చేరాలంటే ముందుగా ఇసుక అక్రమార్కులపై కఠిన చర్యలకు సిద్ధమైంది. ఇసుక అక్రమ రవాణా చేస్తే రెండేళ్ల జైలు శిక్ష, భారీగా జరిమానా విధించేలా ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తేబోతోంది. అర్డినెన్స్‌కు సంబంధించిన ప్రతిపాదనలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించి తుదిరూపు ఇచ్చారు. దీనిపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు.

ప్రతి రెవెన్యూ డివిజ‌న్‌కు ఒక గ్రామ న్యాయాల‌యం

మంత్రివర్గ భేటీలో మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎగువ కోర్టులపై పనిభారం తగ్గించేందుకు గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు గ్రామ న్యాయాల‌యాల‌ ఏర్పాటు ప్రతిపాదనలు కేబినేట్‌ ముందుకు రానున్నాయి. మొదట రాష్ట్రవ్యాప్తంగా 85 గ్రామ‌న్యాయాల‌యాలు ఏర్పాటు అంశంపై చ‌ర్చించ‌నున్నారు. ప్రతి రెవెన్యూ డివిజ‌న్‌కు ఒక గ్రామ న్యాయాల‌యం ఏర్పాటు చేయ‌నున్నట్లు తెలిసింది. అవ‌స‌ర‌మైన మేర‌కు గ్రామ న్యాయాల‌యాల‌ను పెంచుకుంటూ పోవాల‌ని ప్రభుత్వం భావిస్తోంది. 50 వేల విలువ గ‌ల ప్రతి కేసు గ్రామ న్యాయాల‌యాల క్రింద‌కు వ‌చ్చేలా చ‌ట్టంలో మార్పులు చేయ‌నున్నారు. మొబైల్ కోర్టుల త‌ర‌హాలో గ్రామ న్యాయాల‌యాలు న‌డ‌వ‌నున్నాయి. గ్రామ న్యాయాల‌యాలు అంశాన్ని న్యాయశాఖ‌, పోలీసు శాఖ చ‌ర్చించి మంత్రివ‌ర్గం ముందు ప్రతిపాద‌న‌లు ఉంచాయి.

అసైన్డ్ భూములకు పరిహారం

అక్రమ లేఔట్లు, ఫ్లాట్లను క్రమబద్దీకరించే అంశం మంత్రివ‌ర్గం ముందుకురానుంది. 12 ఏళ్ల క్రితం అక్రమ ప్లాట్ల, లే అవుట్స్ క్రమబద్దీకరించారు. ఇప్పడు మ‌రోసారి అలాంటి వాటిని క్రమబద్దీకరించాలని మున్సిప‌ల్‌ శాఖ భావిస్తోంది. 2019 అగ‌స్టు 31 వ‌ర‌కు, సెల్‌డీడ్ డ్యాక్యుమెంట్లు ఉన్న వాటిని క్రమబద్దీకరించే ప్రతిపాద‌నపై మంత్రివ‌ర్గంలో చ‌ర్చించ‌నున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ఎంతో మంది నిరుపేద‌లు ద‌ళితులు, రైతుల వ‌ద్ద ఉన్న అసైన్డ్ భూములు విషయంలో ఊర‌ట క‌ల్పించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇప్పటివ‌ర‌కు అసైన్డ్ భూములు ప్రభుత్వ అవ‌స‌రాల‌కు తీసుకుంటే ఎలాంటి ప‌రిహారం ఇచ్చేవారుకాదు. ఇక‌పై ప్రభుత్వ అవసరాలకు అసెన్డ్ భూములు తీసుకుంటే మార్కెట్ రేటు కంటే ప‌ది శాతం అద‌నంగా చెల్లించే ప్రతిపాద‌నపై మంత్రివ‌ర్గంలో చర్చ జరిగే అవకాశముంది. వీటితో పాటు కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటుపైనా చర్చించ‌నున్నట్లు తెలిసింది.

Last Updated : Nov 13, 2019, 10:22 AM IST

ABOUT THE AUTHOR

...view details