పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన మంత్రి పదవులకు ప్రధానంగా నలుగురు ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నెలాఖరులోనే మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని పార్టీ వర్గాలు చెబుతుండటంతో.. పదవులు ఎవరికి వరిస్తాయన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. మోపిదేవి వెంకటరమణారావు స్థానంలో శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే డాక్టర్ సిదిరి అప్పలరాజు, తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీశ్ పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో రామచంద్రాపురం ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణా..., కృష్ణా జిల్లా పెడన శాసనసభ్యుడు జోగి రమేష్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నలుగురిలో ఇద్దరు బోస్, మరో ఇద్దరు మోపిదేవి సామాజిక వర్గానికి చెందిన వారు.
పొన్నాడ సతీష్, జోగి రమేష్ ఇ్దదరూ రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సిదిరి అప్పలరాజు, గోపాలకృష్ణా తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికైన గోపాలకృష్ణా అంతకుముందు జడ్పీ ఛైర్మన్‌గానూ పనిచేశారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రివర్గంలోకి తీసుకున్న వారిలో జూనియర్లకు చోటు దక్కలేదు. ఇప్పుడైనా తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తారా? లేదా? అనే సందేహాలున్నాయి.