ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వంతో చర్చలు విఫలం.. మున్సిపల్ కార్మికుల సమ్మె యథాతథం ! - పారిశుద్ధ్య కార్మికులతో ప్రభుత్వ చర్చల వార్తలు

మున్సిపల్ కార్మికులు
మున్సిపల్ కార్మికులు

By

Published : Jul 11, 2022, 9:02 PM IST

Updated : Jul 12, 2022, 4:16 AM IST

20:58 July 11

సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేసిన మున్సిపల్ కార్మిక సంఘాలు

ప్రభుత్వం జరిపిన చర్చలపై కార్మికులు సంతృప్తి వ్యక్తం చేశారు: మంత్రి

మున్సిపల్ కార్మిక సంఘాలతో మంత్రులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించలేదని.. అందువల్ల సమ్మె కొనసాగిస్తామని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి. ప్రధాన డిమాండ్లు కాక.. మిగతావి పరిష్కరిస్తామన్నారని కార్మిక నేతలు తెలిపారు. ప్రధాన సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం చేస్తామని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. రూ.3 వేల హెల్త్ అలవెన్సు పెంచాలని, అలాగే వేతనాలు రూ.21 వేలకు పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.

కార్మికులు సంతృప్తి వ్యక్తం చేశారు: తాము జరిపిన చర్చల పట్ల కార్మికులు సంతృప్తి వ్యక్తం చేశారని మంత్రి సురేశ్ తెలిపారు. హెల్త్ కార్డులు, జీపీఎఫ్, పీఆర్సీ వంటి 20 అంశాలపై చర్చలు జరిగాయన్నారు. వైకాపా వచ్చాక కార్మికుల జీతాలు గణనీయంగా పెంచామన్నారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించినట్టు చెప్పారు. తాము జరిపిన చర్చలపై.. కార్మిక సంఘాలు మాట్లాడుకొని తమ నిర్ణయం వెల్లడిస్తామని తెలిపాయన్నారు.

విధులకు రావాలని కోరాం: చర్చల్లో కార్మిక సంఘాల నేతలు.. రూ.21 వేల వేతనం ఇవ్వాలని కోరినట్టు మంత్రి బొత్స తెలిపారు. కార్మికులకు సంబంధించి మొత్తం 20 సమస్యలపై చర్చలు జరిపామన్న బొత్స.. కార్మికుల జీతాలు ప్రభుత్వం 80 శాతం పెంచిందని చెప్పారు. అలాంటిది.. మళ్లీ వేతనాలు మరింతగా పెంచాలని కోరడం సరికాదన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా విధులకు రావాలని కోరామన్నారు.

ఎక్కడి చెత్త అక్కడే..: పారిశుద్ధ్య కార్మికులు సోమవారం నుంచి నిరవధిక సమ్మె చేయడంతో నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నుంచి చెత్త సేకరణ, రహదారులు, కాలువలు శుభ్రం చేసే పనులకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. కొద్దిమంది శాశ్వత ఉద్యోగులు, ఇతర ప్రైవేట్‌ కార్మికులతో పలు చోట్ల రహదారులు శుభ్రం చేయించారు. కొన్ని నగరాల్లో ఇళ్ల ముంగిటకొచ్చే వాహనాల్లో ప్రజలే చెత్త తీసుకెళ్లి వేశారు. కార్మికులు విధులకు హాజరు కానందున అత్యధిక ప్రాంతాల్లో ఇళ్ల నుంచి చెత్త సేకరణ నిలిచిపోయింది. నిరవధిక సమ్మె చేస్తున్నట్లు కార్మికులు ప్రకటించినా చాలాచోట్ల అధికారుల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంతంత మాత్రమే.

తమ డిమాండ్లు పరిష్కరించాలని పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లోని దాదాపు 35 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు సొమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే కొన్ని నగరాల్లో రహదారులు శుభ్రం చేసే పనులు నిలిపివేశారు. సోమవారం ఉదయం నుంచి కార్మికులు విధుల్లోకి రాని కారణంగా పట్టణ రహదారులు, కాలువలు శుభ్రం చేసే పనులు నిలిచిపోయాయి. ఇళ్ల నుంచి తడి, పొడి చెత్త సేకరణ కోసం వాహనాలు పంపినా...వాటిలో కార్మికులు లేరు. విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరం, కాకినాడ, తిరుపతి, గుంటూరు తదితర ప్రాంతాల్లోని పలు వీధుల్లో ఇళ్లలో చెత్తను ప్రజలే తీసుకొచ్చి వాహనాల్లో వేశారు. కార్మికులు సమ్మె చేస్తున్నందున.. సహకరించాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సూపర్‌వైజర్లు మైకులో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

  • విజయవాడ నగరపాలక సంస్థలో 3,200 మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు దాదాపు 500 మందితో ముఖ్యమైన వీధుల్లో పారిశుద్ధ్య పనులు చేయించారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కార్మికులంతా ధర్నా చౌక్‌లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
  • మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ)లో దాదాపు 6,373 మంది కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో పారిశుద్ధ్య పనులకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. ఇళ్ల నుంచి తడి, పొడి చెత్త సేకరణ కూడా విశాఖలోని అత్యధిక ప్రాంతాల్లో నిలిచిపోయింది. చెత్త నిర్వహణ కేంద్రాలు, వాహనాలు నిలిపే కేంద్రాల ఎదుట కార్మికులు సోమవారం ధర్నాలు చేశారు.
  • గుంటూరు నగరపాలక సంస్థలో 1,600 మందికిపైగా కార్మికులు సమ్మెకు దిగారు. తిరుపతి నగరపాలక సంస్థలో శాశ్వత, ఒప్పంద కార్మికులతో కలిపి 826 మంది సమ్మెలో పాల్గొనడంతో పారిశుద్ధ్య పనులపై తీవ్ర ప్రభావం చూపింది. కడప నగరపాలక సంస్థలో 664, నెల్లూరులో 1,175 మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. నెల్లూరులో శాశ్వత కార్మికులు 263 మందితో నగరంలోని ప్రధాన రహదారుల్లో శుభ్రత పనులు చేయించారు. ఒంగోలులో 689 మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. వీరంతా నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుటధర్నా చేయడంతోపాటు ప్రదర్శనగా కలెక్టరేట్‌ వరకు వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. మచిలీపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, విజయనగరం, శ్రీకాకుళం నగరపాలక సంస్థల్లోనూ కార్మికులు సమ్మెకు దిగడంతో పారిశుద్ధ్య పనులు నిలిచిపోయియి.

ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికుల సమ్మె.. ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త

Last Updated : Jul 12, 2022, 4:16 AM IST

ABOUT THE AUTHOR

...view details