Andhra Pradesh Annual Crime Report: రాష్ట్రంలో ఈ ఏడాది జరిగిన నేరాలపై డీజీపీ గౌతమ్ సవాంగ్ వార్షిక నివేదిక విడుదల చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే నేరాల రేటు 3శాతం పెరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మహిళలపై జరుగుతున్న నేరాలు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 21 శాతం పెరగటం కొంత ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు సైబర్ నేరాలు ఈ ఏడాది 18 శాతం తగ్గాయని వార్షిక నివేదికలో డీజీపీ వెల్లడించారు. స్మార్ట్ పోలీసింగ్‌లో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు.
మహిళల పై జరుగుతున్న నేరాలు 21 శాతం, ప్రాపర్టీ అఫెన్సెస్ రేటు 15 శాతం పెరిగాయని తాజా నివేదికలో పోలీసులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది జరిగిన నేరాల రేటు గతేడాది కన్నా 3 శాతం అధికంగా ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మహిళలు నిర్భయంగా పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయటమే అధిక కేసుల నమోదుకు కారణమని డీజీపీ చెబుతున్నారు.
ఈ ఏడాది మొత్తం 1,27,127 కేసులు నమోదయ్యాయని తెలిపారు. మర్డర్ ఫర్ గెయిన్ గతేడాది 29 జరిగితే ఈ ఏడాది 43 జరిగాయన్నారు. దోపిడీలు 246, డెకాయిటీలు 47 జరిగాయని వార్షిక నివేదికలో తెలిపారు. ఈ ఏడాది మొత్తం 1,27,127 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయన్నారు. వీటిలో 90 శాతం ఛార్జ్ షీట్లు వేశామని, 75 శాతం శిక్షలు కూడా పడ్డాయని వివరించారు. 75 అత్యాచారం, 1061 లైంగిక దాడుల కేసుల్లో వారం రోజుల్లో ఛార్జ్ షీట్ వేశామన్నారు. 1,551 మంది పై సైబర్ బుల్లియింగ్ షీట్స్ ఓపెన్ చేసినట్లు డీజీపీ తెలిపారు. దిశ మొబైల్ యాప్‌ను 97 లక్షల మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారని .. త్వరలోనే కోటి డౌన్ లోడ్ లక్ష్యాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. 40 వేల ఎఫ్ఐఆర్ లు స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నమోదు చేసినట్లు పేర్కొన్నారు. స్పందన కార్యక్రమంలో 52 శాతం మంది మహిళలే ఫిర్యాదులు చేశారన్నారు. నేరాల పట్ల మహిళల్లో చైతన్యం వచ్చిందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు గతేడాది పోలిస్తే శాతం తగ్గటం గమనార్హం.