DGP Attended In AP High Court: రేషన్ బియ్యం తరలిస్తున్నాననే నెపంతో.. నంద్యాల జిల్లా పాములుపాడు పోలీస్ స్టేషన్ ఏఎస్సై సీజ్ చేసిన తన లారీని విడిచిపెట్టేలా ఆదేశాలివ్వాలంటూ.. రఫీ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. నిత్యావసర సరుకుల చట్టం నిబంధల ప్రకారం వాహనాల తనిఖీ, సరుకు సీజ్ చేసే అధికారం ఏఎస్ఐకి లేదని.. ఇదే అంశంపై కోర్టుకు వెళ్లిన మరో పిటిషనర్ తెలిపారు. దిగువ స్థాయి పోలీసులు వాహనాలు సీజ్ చేసి నెలల తరబడి ఠాణాల్లో ఉంచుతున్నారని, ఎస్ఐ హోదాకు తగ్గని వ్యక్తి తనిఖీలు చేయడానికి వీల్లేదని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ప్రవరిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు ఆదేశాల మేరకు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి స్వయంగా కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. డీజీపీ తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు.
కోర్టు ఉత్తర్వులు పాటించాలని డీజీపీ సర్క్యులర్ ఇచ్చారని, కొందరు కిందిస్థాయి సిబ్బంది దాన్ని పట్టించుకోకపోవడం వాస్తవమేనని ఏజీ అంగీకరించారు. సర్క్యులర్ ఇచ్చి వదిలేస్తే ఎలాగన్న న్యాయమూర్తి.. ఇప్పటికీ ఈ తరహా కేసులు దాఖలు అవుతున్నాయని గుర్తుచేశారు. ఈనేపథ్యంలో డీజీపీని పిలిపించామని, దీన్ని పనిష్‌మెంట్‌గా భావించొద్దని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అధికారం లేని పోలీసు అధికారి కేసు నమోదు చేస్తే న్యాయసమీక్షకు నిలుస్తుందా? అనినేరుగా డీజీపీనే ప్రశ్నించారు. నిలువదని బదులిచ్చిన డీజీపీ రేషన్ బియ్యం అక్రమ రవాణా తనిఖీల విషయంలో కోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన పోలీసుల్ని డిస్‌మిస్ చేస్తామన్నారు.