ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 27, 2021, 11:56 AM IST

Updated : Jul 27, 2021, 2:15 PM IST

ETV Bharat / city

Green India Challenge: రామోజీ ఫిలిం సిటీలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన బిగ్​బీ

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో మైలురాయిని చేరుకుంది. స్వయంగా బాలీవుడ్ సూపర్ స్టార్.. అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఈ సవాల్​ను స్వీకరించారు. తెలంగాణ ఎంపీ సంతోశ్​ కుమార్​ ఛాలెంజ్​ను స్వీకరించిన బిగ్​ బీ.. హైదరాబాద్​ ఫిల్మ్​ సిటీలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోశ్​ను ప్రశంసించారు.

Amitabh planted sapling in ramoji film city
మొక్క నాటిన అమితాబ్

రామోజీ ఫిలిం సిటీలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన బిగ్​బీ

రాజ్యసభలో తెలంగాణ ఎంపీ సంతోశ్​ కుమార్​ పేరు... ఎప్పుడు విన్నా సరే.. దాదాపుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. హరిత సవాల్​ ద్వారానే ఉంటుంది. ఎందుకంటే.. తెలంగాణ తల్లికి పచ్చని ప్రకృతి చీర కట్టాలని.. రాష్ట్రమంతా పచ్చదనంతో పరిఢవిల్లాలనే ఉద్దేశంతో సంతోశ్.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ను మొదలుపెట్టానని చెబుతుంటారు. ఇందులో భాగంగా ఎందరో సినిమా సెలిబ్రిటీలు, ప్రముఖ రాజకీయ నాయకులకు హరిత సవాల్ విసిరారు.

ఎంపీ సంతోశ్​ కుమార్ ప్రారంభించిన హరిత సవాల్ (Green India Challenge)​ ఉద్దేశాన్ని గ్రహించిన రామోజీ సంస్థలు.. పచ్చదనానికి ప్రాముఖ్యతనిస్తూ.. రామోజీ ఫిలిం సిటీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ వేడుకలో బాలీవుడ్ సూపర్​స్టార్.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, సినీ నటుడు అక్కినేని నాగార్జున, ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్, సినీ నిర్మాత అశ్వనీదత్​ పాల్గొన్నారు. వీరందిరికి ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి మొక్కలను అందించారు. రామోజీ ఫిలిం సిటీలోని సాహస్ ప్రాంగణంలో మొక్కలు నాటారు.

మొక్కలు నాటిన అమితాబ్..

ప్రాజెక్ట్-కె చిత్ర షూటింగ్​ కోసం అమితాబ్ హైదరాబాద్​లోని రామోజీ ఫిలిం సిటీకి వచ్చారు. ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం గురించి తెలుసుకుని పర్యావరణ పరిరక్షణకై తన వంతు బాధ్యతగా మొక్కలు నాటారు. ఎంపీ సంతోశ్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్(Green India Challenge) గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఇప్పటికే 16 కోట్ల మొక్కలు నాటారని విని.. అభినందించారు.

" భవిష్యత్ తరాలకు హరిత సవాల్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఛాలెంజ్​ను ఇలాగే కొనసాగించాలి. మొక్కలు నాటేందుకు ప్రముఖులంతా ముందుకు రావాలి. తమ అభిమానులను మొక్కలు నాటేలా ప్రోత్సహించాలి. నన్ను ప్రేమించే వారు కూడా మీ స్పెషల్ డే రోజున మొక్కలు నాటండి. మీకు ప్రత్యేకమైన వారికి మొక్కలనే గిఫ్ట్​గా ఇవ్వండి."

- అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ మెగాస్టార్

భావి భారత పౌరులకు గ్రీన్ ఇండియాను అందించే బాధ్యత నేటి తరానిదేనని రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్​ అన్నారు. ప్రకృతిని కాపాడుకునేెందుకే తాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ (Green India Challenge)ను ప్రారంభించానని తెలిపారు.

నాటడమే కాదు.. సంరక్షణా చూస్తున్నా..

ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కినేని నాగార్జున కూడా మొక్కలు నాటారు. ఇప్పటికే ఆయన ఈ ఛాలెంజ్​ను రెండు మూడు సార్లు స్వీకరించారు. తాను మొక్కలు నాటడమే కాకుండా.. వాటి సంరక్ష బాధ్యత తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎంపీ సంతోశ్​ ఎంతో మంచి పని చేస్తున్నారని ప్రశంసించారు. మొక్కలు నాటి తెలంగాణలో పచ్చదనం పరిఢవిల్లేలా చేయాలని నాగార్జున తన అభిమానులను కోరారు.

ఇవీ చదవండి:Jagananna Paccha Thoranam: జగనన్న పచ్చతోరణం..ఈ ఏడాది లక్ష్యం 68 లక్షల మొక్కలు

"గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించినప్పటి నుంచి.. ఎవరి పుట్టిన రోజైనా.. ఏదైనా సినిమా రిలీజ్​ అయినా.. సినిమా హిట్​ అయిన వారికి శుభాకాంక్షలు తెలపాలన్నా.. ముందుగా మొక్కనే గిఫ్ట్​గా ఇస్తున్నాను. నా అభిమానులు కూడా మొక్కలు నాటి.. పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలి."

- నాగార్జున, సినీ నటుడు

మొక్క విలువ తెలిసింది..

కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ విలువ తెలిసిందని.. పర్యావరణాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అర్థమైందని దర్శకుడు నాగ్ అశ్విన్ అన్నారు. ఎంపీ సంతోశ్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge) బృహత్తరమైన కార్యక్రమమని అశ్వినీదత్ తెలిపారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని చెప్పారు.

వృక్షవేదం..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆవశ్యకతను వివరిస్తూ రూపొందించిన వృక్షవేదం పుస్తకాన్ని ఎంపీ సంతోశ్.. అమితాబ్, నాగార్జున, అశ్వినీదత్, నాగ్ అశ్విన్​లకు అందజేశారు. సినిమా షూటింగ్​ కోసం రామోజీఫిలిం సిటీ వచ్చిన బాలీవుడ్ నటులు.. అజయ్ దేవ్​గన్, సోనూసూద్​ ఇప్పటికే మొక్కలు నాటారు. హరిత సవాల్​ ఉద్దేశాన్ని గుర్తించి.. ఫిలిం సిటీ వచ్చిన ప్రముఖులతో మొక్కలు నాటిస్తున్న రామోజీ సంస్థలకు ఎంపీ సంతోశ్​ కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చదవండి:

మా గురువు దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాం: ఫైట్​ మాస్టర్స్​ రామ్, లక్ష్మణ్

Last Updated : Jul 27, 2021, 2:15 PM IST

ABOUT THE AUTHOR

...view details