రాజధాని అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు మండలం రాయపూడిలో కృష్ణానదిలో నదీపాతం కింద ఉన్న భూములను మెట్టగా మార్చారు. ఈ భూములలో కొంతభాగాన్ని గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దారు బంధువులు కొనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాయపూడి గ్రామ పరిధిలోని సర్వేనంబర్లు 15ఏ, 15బీ, 16ఏ, 16బీ, 17ఏలలో నదీపాతంగా ఉన్న భూమిని వెబ్‌ల్యాండ్ అడంగల్‌లో ఈ ఏడాది మార్చిలో మెట్టభూమిగా మార్చారు. ఆ వెంటనే ఏప్రిల్ నెలలో అమ్మకాలు జరిగాయి. వెబ్‌ల్యాండ్ అడంగల్‌లో భూవర్గీకరణలో మార్పులు చేర్పులు చేసే అధికారం జాయింట్ కలెక్టర్‌కే ఉంది. తుళ్లూరు తహసీల్దారు, గుంటూరు ఆర్డీవో ఇచ్చిన నివేదిక ఆధారంగా భూమి స్వభావాన్ని వెబ్‌ల్యాండ్ అడంగల్‌లో మార్చాలని తుళ్లూరు తహసీల్దారును జేసీ ఆదేశించారు. ఐదు సర్వేనంబర్ల పరిధిలో 7.22 ఎకరాల భూమి ఉంది. ఆ సర్వేనంబర్లకు ముందు, వెనక ఉన్న భూమి నదీపాతంగానే ఉండటం, ఐదు సర్వేనంబర్లనే మెట్ట భూమిగా వర్గీకరించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Amaravati land issue: భూవర్గీకరణ మార్పుపై అనుమానాలు - amaravathi crime news
రాజధాని అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు మండలం రాయపూడిలో కృష్ణానదిలో నదీపాతం కింద ఉన్న భూములను మెట్టగా మార్చారు. ఈ భూములలో కొంతభాగాన్ని గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దారు బంధువులు కొనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని ప్రాంతంలో ఈ అంశం చర్చనీయాంశమైంది.
రాయపూడి గ్రామం రాజధాని ప్రాంతంలో ఉండటం, అదే సమయంలో ఆ భూములను తహసీల్దారు కుటుంబసభ్యులు కొనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణానది చెంతనే గతంలో ఉన్న పట్టాభూములు కాలక్రమంలో నదిలో కలిసిపోవడంతో నదీపాతం కింద గుర్తించి వాటిని రాజధాని భూసమీకరణ నుంచి మినహాయించారు. ఇలాంటి భూములను ఇప్పుడు వర్గీకరణ మార్చి, అవే భూములు క్రయవిక్రయాలు జరగడం వెనుక మతలబు ఏమైనా ఉందా? అన్న చర్చ రాజధాని ప్రాంతంలో జరుగుతోంది. ఈ మార్పు ఆ ఐదు సర్వేనంబర్లకేనా.. జేసీ అనుమతి లేకుండా ఇంకా ఏమైనా చేశారా? అన్న విషయాలు తేలాల్సి ఉంది. ఇటీవలే ఇక్కడ పనిచేస్తున్న తహసీల్దారు బదిలీ అయ్యారు. భూమి స్వభావం వర్గీకరణ విషయాన్ని గుంటూరు జాయింట్ కలెక్టర్ దినేష్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లగా నదిలో ఉన్నా అది పట్టాభూమిగా ఆర్‌ఎస్‌ఆర్‌లో నమోదై ఉందన్నారు. దాన్ని గతంలో నదీపాతంగా మార్చారని, పరిశీలించి మెట్టగా మార్చాలని దరఖాస్తు వచ్చిందని చెప్పారు. దీనిపై క్షేత్రస్థాయి అధికారులు ఇచ్చిన నివేదికను పరిశీలించి వెబ్‌ల్యాండ్ అడంగల్‌లో భూమి వర్గీకరణ మార్పునకు అనుమతించామన్నారు. అవి ప్రైవేటు పట్టా భూములేనని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: Night curfew extended: రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే?