ఉద్ధృతంగా కొనసాగుతున్న అమరావతి రైతుల పోరు రాజధాని పోరాటంలో విద్యార్థులు మేముసైతం అంటూ పాల్గొంటున్నారు. తుళ్లూరులో మానవహారంగా ఏర్పడి ఆందోళన చేశారు. దీక్షా శిబిరంలో రైతులు, మహిళలతో చిన్నారులు పాల్గొన్నారు. దీక్షా శిబిరం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకూ ర్యాలీగా వెళ్లారు. రాజ్యాంగ నిర్మాతకు పూలమాల వేసి... అమరావతిని రక్షించాలంటూ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అమరావతిపై ప్రభుత్వ నిర్ణయం మార్చుకోవాలని నినదించారు.
త్యాగాలను పట్టించుకోరా..?
అమరావతి తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వెలగపూడి రైతులు డిమాండ్ చేశారు. రైతుల త్యాగాలను పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రైతుల ఉద్యమానికి ప్రపంచ దేశాల నుంచి మద్దతు లభిస్తుందన్నారు. విద్యార్థులను ప్రభుత్వం బయపెడుతోందని ఆరోపించారు. అమరావతి ఉద్యమంలో పాల్గొంటే కేసులు పెడతామని హెచ్చరిస్తుట్టు వాపోయారు.
అమరావతి కోసం ప్రార్థన
అమరావతి నుంచి రాజధాని తరలిపోకూడదని కోరుతూ... రైతులు దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. సర్వమత ప్రార్ధనలు చేస్తున్నారు. రాజస్థాన్‌లోని అజ్మేర్, నాగ్‌పూర్ దర్గాలను దర్శించారు. రాజధాని తరలిపోకుండా కాపాడాలని వేడుకున్నారు. మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. అమరావతే రాజధానిగా ఉండాలని అన్నదానం చేశారు.