అమరావతి రైతుల మహాపాదయాత్ర నెల్లూరు జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. 27వ రోజు పాదయాత్రకు జనం పోటెత్తారు. వివిధ రాజకీయ పార్టీలతోపాటు ప్రజాసంఘాలు, కుల సంఘాలు, స్వచ్ఛంద, సేవా సంస్థ ప్రతినిధులు మహాపాదయాత్రకు సంఘీభావం తెలిపారు. పాదయాత్ర ప్రారంభమైన కొద్ది సేపటికే జోరు వర్షం కురిసింది. అయినా.. చెక్కు చెదరని సంకల్పంతో వర్షంలోనే తడుస్తూ రైతులు ముందుకు కదిలారు. జై అమరావతి నినాదాలు(Jai amaravathi slogans) చేశారు. వానైనా వరదైనా ఆగని ఉద్యమం అమరావతి ఉద్యమం అంటూ నినాదాలు చేశారు. భోజన విరామం తర్వాతా వర్షం ఇబ్బందిపెట్టినా రైతులు యాత్రను ఆపలేదు. పొదలకూరు రోడ్డు వద్ద పాదయాత్ర 300 కిలోమీటర్లకు చేరడంతో.. స్థానికులు బంతిపూలతో వారికి స్వాగతం పలికారు.
నేతల మద్దతు..
రైతుల పాదయాత్రలో తెలుగుదేశం, కాంగ్రెస్ నేతలు(party leaders support) పాల్గొన్నారు. రైతులతో కలిసి పాదం కదిపారు. రాళ్ల వర్షం కురుస్తుందని వైకాపా చేసిన బెదిరింపులకు భిన్నంగా జనం పూల వర్షం కురిపిస్తున్నారని నేతలు అన్నారు. ప్రజల స్పందనను సీఎం జగన్ గ్రహించాలని హితవు పలికారు. భాజపా కిసాన్ మోర్చా , రైతు కూలీలు యాత్రలో పాల్గొన్నారు.