ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AMARAVATI PADAYATRA: జన నీరాజనాల మధ్య ఉత్సాహంగా 'రైతుల మహాపాదయాత్ర'

FARMERS PADAYATRA: రాజధాని రైతుల మహాపాదయాత్ర జోరుగా, హుషారుగా సాగుతోంది. యాత్రా మార్గం వెంబడి జనం అపూర్వ స్వాగతం పలుకుతూ, సంఘీభవం తెలుపుతూ... రైతుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నారు. ఇక రెండు రోజుల క్రితం పోలీసుల దాడిలో గాయపడ్డ బౌన్సర్ శివను.. తప్పుడు స్టేట్‌మెంట్ ఇవ్వాలంటూ కొందరు ప్రలోభ పెడుతున్నారని అమరావతి పరిరక్షణ సమితి ఆరోపించింది.

AMARAVATI PADAYATRA
AMARAVATI PADAYATRA

By

Published : Dec 6, 2021, 6:57 AM IST

జన నీరాజనాల మధ్య ఉత్సాహంగా 'రైతుల మహాపాదయాత్ర'

AMARAVATI FARMERS PADAYATRA: అమరావతి రైతుల పాదయాత్రకు ఊరూవాడ అఖండ స్వాగతం లభిస్తోంది. 35వ రోజు నెల్లూరు జిల్లా గూడురు నియోజకవర్గంలోని పుట్టంరాజుగారి కండ్రిగ వద్ద ప్రారంభమైన యాత్ర.. వెంకటరెడ్డిపాలెం వద్ద వెంకటరిగి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. అక్కడ రైతులకు పూలతో స్వాగతం పలికే వాహనాన్ని పోలీసులు నిలిపివేయడంతో.. బుట్టల్లో పూలు తెచ్చి మరీ స్థానిక ప్రజలు దారి పొడవునా అన్నదాతలపై చల్లారు. మహిళలకు హారతులు పట్టారు. వేంకటేశ్వరస్వామి రథానికి గుమ్మడి కాయలతో దిష్టి తీసి, కొబ్బరికాయలు కొట్టారు. యాత్ర ఆసాంతం డప్పుచప్పుళ్లు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య ఉత్సాహంగా సాగింది.

రైతుల యాత్రకు ప్రజా సంఘాలు, రాజకీయ నేతలు మద్దతు తెలిపారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. రైతులకు సంఘీభావంగా 35వ రోజు యాత్రలో పాల్గొన్నారు. వారితో కలిసి కొంతదూరం నడిచారు. తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్, భాజపా కిసాన్‌ మోర్చా నాయకులు, సీపీఐ, సీపీఎం నేతలు, వృత్తి సంఘాల ప్రతినిధులు.. రాజధాని రైతులతో కలిసి నడిచారు. యాత్ర తమ గ్రామాల మీదగా వస్తుందని తెలిసిన ప్రజలు.. రోడ్డుపైకి వచ్చి ఆదరాభిమానాలు చూపారు. మేము సైతం అంటూ రైతులతో కలిసి యువత పాదం కలిపారు.

''శనివారం బౌన్సర్‌పై దాడి, ఇతర పరిణామాలతో వెంకటగిరి సీఐ నాగమల్లేశ్వరరావును ఉన్నతాధికారులు పాదయాత్ర విధులకు దూరంగా ఉంచారు. గూడూరు సీఐ నాగేశ్వరమ్మకు బందోబస్తు బాధ్యతలు అప్పగించారు. నెల్లూరు జిల్లాలో వైకాపాకు చెందిన ఓ కీలక నేత.. సదరు సీఐ తీరుతో తమ పార్టీకి చెడ్డపేరు వస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పాదయాత్ర ముగిసే వరకు సీఐ నాగమళ్లేశ్వరరావును విధులకు దూరంగా ఉంచాలని.. లేదా సెలవుపై పంపాలని ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఇక పోలీసుల దాడిలో పక్కటెముక విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బౌన్సర్ శివను.. 30వేల రూపాయలు ఇస్తామని కొందరు ప్రలోభ పెట్టినట్లు అమరావతి పరిరక్షణ సమితి ఆరోపించింది'' -గద్దె తిరుపతిరావు, కో-కన్వీనర్‌ అమరావతి పరిరక్షణ సమితి

మహా పాదయాత్ర చేస్తున్న రైతులకు విరాళాలు కొనసాగుతున్నాయిు. చెన్నై తెలుగు ప్రజలు రూ.7లక్షల విరాళం అందించారు. రాపూరు మండలం మాజీ మండల అధ్యక్షుడు బండి కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు వేణుగోపాలరెడ్డి రూ.9 లక్షల విరాళం ఇచ్చారు. ఆస్ట్రేలియా NRI ఫ్రెండ్స్‌ లక్ష, గుంటూరు జిల్లా గూడవల్లి వాసులు మరో లక్ష రూపాయలు అందజేశారు. నేడు 36వ రోజు వెంగమాంబపురం నుంచి వెంకటగిరి వరకు పాదయాత్ర సాగనుంది.

ఇదీ చదవండి:

ANNAMAYYA DAM: అన్నమయ్య, పింఛ కట్టల విధ్వంసం.. విపత్తా? వైఫల్యమా?

ABOUT THE AUTHOR

...view details