అమరావతి ఆందోళనల నేపథ్యంలో విజయవాడ నగరం, చుట్టు పక్కల జరిగే శుభకార్యాలు నిరసన వేదికలుగా మారుతున్నాయి. కృష్ణా జిల్లాకు చెందిన తుళ్లూరి రాము, దివ్య దంపతులు మహారాష్ట్రలోని పూణెలో స్థిరపడ్డారు. తమ కుమార్తె శ్రేష్ట... నూతన వస్త్ర బహూకరణ వేడుకను విజయవాడ నగరంలోని ఓ హోటల్లో నిర్వహించారు. వేడుకకు వచ్చిన బంధువులు, స్నేహితులు పచ్చ కండువాలు ధరించి... జై అమరావతి, ఆంధ్రప్రదేశ్‌ని కాపాడుకుందాం అంటూ నినాదాలు చేశారు.
అమరావతి రైతుల ఆందోళన: వేడుక ఉద్యమ వేదికే..! - రాజధాని అమరావతి వార్తలు
శుభకార్యాల్లోనూ అమరావతి రైతుల నిరసనల హోరు... జోరు తగ్గట్లేదు. ఇటీవల ఓ పెళ్లిలో అమరావతి నినాదాలతో హోరెత్తించగా... ఇవాళ విజయవాడలో జరిగిన ఓ వేడుకలోనూ ప్లకార్డులు ప్రదర్శించారు.
శుభకార్యాల్లోనూ జై అమరావతి నినాదాల హోరు
రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా 29 గ్రామాల్లో జరుగుతున్న పోరాటానికి మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శించారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చిన అతిథులు రాజధాని రైతులకు మద్దతుగా జెండాలు పట్టుకున్నారు. 60 రోజులుగా శుభకార్యాలకూ వెళ్లకుండా నిరసన తెలుపుతున్నామని చెప్పారు. రాజధాని తరలింపు ప్రకటనతో తీవ్ర నిరాశలో ఉన్నామని మహిళలు, రైతులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ మనసు మార్చుకొని రాజధాని తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు.