వారంలో 'రైతు రక్షణ బస్సు యాత్ర'
‘రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ 47 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న రైతులకు 13 జిల్లాల రైతు సంఘం నాయకులు మద్దతు తెలిపారు. అమరావతి నుంచి రాజధానిని ఒక్క అంగుళం కూడా కదలనివ్వబోమని, ఎటువంటి ఆందోళనకైనా సిద్ధమని పలువురు రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు.
విజయవాడలోని ఒక హోటల్‌లో అమరావతి పరిరక్షణ సమితి, 13 జిల్లాల రైతు సంఘాల ఆధ్వర్యంలో రాజధానిపై చర్చా కార్యక్రమం జరిగింది. రాజధాని రైతులకు మద్దతు తెలపడంతోపాటు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేసి తీర్మానాలు చేశారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. ‘మూడు రాజధానుల నిర్ణయం సహేతుకమైనది కాదు. విశాఖపట్నంలో భూములు కొని వారు లాభాలు పొందాలనే ఉద్దేశంతో రాజధానిని మారుస్తున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులు, మహిళలపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా రైతు రక్షణ బస్సు యాత్రను నిర్వహిస్తాం. మార్చిలో పెద్ద ఎత్తున రైళ్లలో దిల్లీ వెళ్లి పార్లమెంటు ఎదుట ఆందోళనలను చేపడతాం. తద్వారా రాజధాని సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాం’ అని పేర్కొన్నారు.