రాష్ట్రంలో రాజధాని మార్పు, పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించిన విషయాల్లో కేంద్రం పాత్ర లేదంటూ... కేంద్ర హోంశాఖ అధికారులు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడాన్ని అమరావతి పరిరక్షణ సమితి తప్పుపట్టింది. ఈ అఫిడవిట్ రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది. అఫిడవిట్‌పై పునఃపరిశీలన చేయాలని కోరుతూ... కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు అమరావతి ఐకాస ఛైర్మన్ జీవీఆర్ శాస్త్రి లేఖ రాశారు.
కేంద్ర హోంశాఖ ఈ నెల 6న ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో రాజధాని ఎంపిక, ఏర్పాటుపై కేంద్రం పాత్ర ఉండదని.. రాష్ట్ర ప్రభుత్వ అభీష్టం మేరకే ఉంటుందని స్పష్టం చేసిందని లేఖలో గుర్తుచేశారు. అయితే... అదే అఫిడవిట్‌లోని 11, 12 పేరాలు పరిశీలించాలని జీవీఆర్ శాస్త్రి కోరారు.
11వ పేరాలో..
- ఏపీ పునర్విభజన చట్టం-2014 సెక్షన్ 6 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ రాజధానిపై పలు సూచనలు చేసింది. తదనంతరం ఏపీ ప్రభుత్వం 2015 ఏప్రిల్ 23న రాజధానిగా అమరావతిని నోటిఫై చేసింది. ప్రస్తుతం రాష్ట్ర రాజధాని ఎంపిక రాష్ట్రం నిర్ణయిస్తుందని.. దీంట్లో కేంద్రం పాత్ర ఉండదని అంటున్నారు.
12వ పేరాలో..
- ఈ ఏడాది జులై 31న ఏపీ ప్రభుత్వం ఏపీ డీసెంట్రలైజేషన్, ఇన్‌క్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్స్ యాక్ట్-2020ను గెజిట్‌లో ప్రచురించింది. దాని ప్రకారం రాష్ట్రానికి శాసన రాజధానిగా అమరావతి, పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. దీన్నిబట్టి రాష్ట్ర రాజధాని ఏర్పాటులో కేంద్రం పాత్ర ఉండదని కేంద్రమే తెలిపినట్లైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదిత మూడు రాజధానుల వల్ల విపరీత పరిణామాలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని శాస్త్రి లేఖలో పేర్కొన్నారు.