రాజధాని విషయంలో మోసపోయిన తమకు మరణమే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందడం మహాధర్నాలో పాల్గొన్న మహిళా రైతులు... రాష్ట్రపతికి లేఖలు రాశారు. కారుణ్య మరణాలకు అవకాశం కల్పించాలంటూ అభ్యర్థించారు. తాము ఇలా కారుణ్య మరణాలకు దరఖాస్తు చేసుకునే దుస్థితి రావటం కంటే మరో దౌర్భాగ్యం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే లక్ష్యంతో రాజధాని రైతులు వినూత్న నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా తుళ్లూరు రైతులు తమకు కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలంటూ.. రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను ఉత్తరాల ద్వారా అభ్యర్థించారు. తమ భూములు రాజధానికి అప్పగించామని... మూడు రాజధానుల ప్రతిపాదనతో తమ భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.