రాజధానిగా అమరావతిపరిరక్షణే ధ్యేయంగా రైతులు, మహిళలు చేస్తున్న పోరాటం 95వ రోజుకు చేరుకుంది. కరోనా వ్యాప్తి దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూని పాటిస్తామని రైతులు తెలిపారు. కర్ఫ్యూ ప్రారంభానికి ముందు అరగంట, కర్ఫ్యూ ముగిసిన తర్వాత అరగంట... దీక్షా శిబిరాల్లో నిరసన ప్రదర్శన చేస్తామని తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తమ పోరాటంలో కొన్ని మార్పులు చేసినట్లు అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ సుధాకర్ తెలిపారు. ఇక నుంచి దీక్ష శిబిరాల్లో తక్కువ మంది కూర్చోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మిగతా వారంతా ఇళ్లలోనే తమ నిరసనను వ్యక్తం చేస్తారని చెప్పారు. పోరాటానికి విరామం ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చారు. ఇక నుంచి 'అమరావతి వెలుగు' పేరిట వినూత్న కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.
'కరోనాతో జాగ్రత్తగా ఉంటాం.. అమరావతి పోరాటం కొనసాగిస్తాం'
అమరావతి కోసం తమ పోరాటం ఆగదని రైతులు, మహిళలు స్పష్టం చేశారు. కరోనా కారణంగా ప్రధాని మోదీ సూచనలు పాటిస్తూనే.. ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. 'అమరావతి వెలుగు' పేరుతో వినూత్నంగా నిరసన తెలుపుతామన్నారు.
అమరావతి ఆందోళనలు