ప్రభుత్వాన్ని నమ్మి తాము భూములిచ్చామని, పార్టీలకు కాదని అమరావతి రైతులు స్పష్టం చేశారు. వైకాపా ఆడే రాజకీయ క్రీడలో సమిధలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం వార్షిక కౌలు కూడా చెల్లించకుండా కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న నిరసనలు 184వ రోజు కొనసాగాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడి, పెదపరిమి, నేలపాడు తదితర గ్రామాల్లో ఐకాస కండువాలు ధరించి నిరసన తెలిపారు. న్యాయంగా, ధర్మంగా పోరాడుతున్న రైతులదే అంతిమ విజయమని రాజధాని అమరావతి పరిరక్షణ ఐకాస నాయకురాలు డా.రాయపాటి శైలజ అన్నారు. గుండెపోటుతో మరణించిన రైతు సాంబశివరావు కుంటుంబ సభ్యులను పరామర్శించారు.
రైతుల త్యాగం వృథా కాదు: ఎంపీ గల్లా
ప్రజా రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు ఇచ్చిన మీ త్యాగం వృథా కాదని, రాజధాని అమరావతి అభివృద్ధి జరిగే వరకు మీ పోరాటానికి ముందుంటానంటూ ఎంపీ గల్లా జయదేవ్ రైతులకు భరోసా ఇచ్చారు. గురువారం తుళ్లూరు మండలం వెలగపూడి, తుళ్లూరు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఒక్కసారి శాసన మండలిలో వెనక్కి వచ్చిన బిల్లును మళ్లీ ప్రవేశపెట్టడం దురుద్దేశమే అన్నారు. రాజధాని రైతులకు వార్షిక కౌలు ఇంతవరకు అందించకపోవడం దారుణమన్నారు. సాంబశివరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆగిన రాజధాని రైతు గుండె
గుండెపోటుతో మృతి చెందిన రైతు చింకా సాంబశివరావు మూడు రాజధానుల నిర్ణయానికే రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న రాష్ట్ర గవర్నర్ ప్రసంగంతో మనోవేదనకు గురైన ఓ రైతు గుండె ఆగింది. రాజధాని నిర్మాణానికి తనకున్న ఎకరం భూమి ఇచ్చిన తుళ్లూరు మండలం అనంతవరం గ్రామ రైతు చింకా సాంబశివరావు...మూడు రాజధానుల నిర్ణయంతో మానసికంగా కుంగిపోయారు. రెండు రోజులుగా మరింతగా మనోవేదనకు గురయ్యారు. ఈ క్రమంలోనే బుధవారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతిచెందినట్లు బంధువులు తెలిపారు.