ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గ్రేటర్ ఫలితాలు: ఒకే పార్టీకి పట్టం.. ఎల్బీనగర్ ఓటర్ల​ నైజం - తెలంగాణ తాజావార్తలు

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గ ఓటర్లంతా ఒకేరకమైన తీర్పు ఇస్తారని ముచ్చటగా మూడోసారి రుజువైంది. అభ్యర్థులతో సంబంధం లేకుండా గంపగుత్తగా ఒకే పార్టీకి అన్ని డివిజన్లను అప్పగించారు. నియోజకవర్గంలోని మొత్తం 11 డివిజన్లతోపాటు మహేశ్వరం నియోజకవర్గంలోని 2 డివిజన్లలో భాజపాను గెలిపించారు. 2009లో ఈ డివిజన్లను కాంగ్రెస్‌కు కట్టబెట్టిన ఓటర్లు... 2016లో తెరాస హోరుతో గులాబీ జెండాను ఎగురవేశారు. తాజాగా కమలాన్ని వికసింపజేశారు.

ghmc elections
ఎల్బీనగర్​లో భాజపా జయకేతనం

By

Published : Dec 5, 2020, 7:06 AM IST

Updated : Dec 5, 2020, 7:22 AM IST

గ్రేటర్ ఎన్నికల్లో ఊహించని విధంగా మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్న భాజపా... ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని క్లీన్‌స్వీప్ చేసింది. నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లను గెలుచుకోగా... మహేశ్వరం నియోజకవర్గంలోని 2 డివిజన్లలోనూ కమలం వికసించింది. గత ఎన్నికల్లో కేవలం ఆర్కేపురం మినహా ఎక్కడా గెలవని భాజపా... ఈసారి అన్ని డివిజన్లలోనూ సత్తా చాటింది.

ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని వనస్థలిపురం, చంపాపేట్‌, హస్తినాపురం, లింగోజిగూడ... హయత్‌నగర్ పరిధిలోని హయత్‌నగర్, నాగోల్, బీఎన్​రెడ్డి నగర్‌, మన్సూరాబాద్.... సరూర్‌నగర్ పరిధిలోని సరూర్‌నగర్, కొత్తపేట, ఆర్కేపురం, చైతన్యపురి, గడ్డిఅన్నారం డివిజన్ ఓటర్లంతా భాజపా వైపే మొగ్గుచూపారు.

సిట్టింగ్ అభ్యర్థులకే మరోసారి అవకాశం ఇవ్వడం వల్లే తెరాస ఓటమి పాలైందని విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక అభ్యర్థులపై వ్యతిరేకత, వరదసాయంలో అక్రమాలు, ఎల్​ఆర్​ఎస్​ వివాదం... భాజపాకు కలిసొచ్చిందని చెబుతున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని ఓటర్లలో చాలా మంది విద్యావంతులు, ఉద్యోగులుంటారు. నిత్యం జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై అవగాహనతో పాటు పార్టీలు, అభ్యర్థుల తీరును అంచనా వేస్తారు.

తాజాగా రాష్ట్ర రాజకీయ పరిణామాలను అవగతం చేసుకుని భాజపాకు పట్టం కట్టారు. అధికార పార్టీ కార్పొరేటర్లపై వచ్చిన ఆరోపణలతోపాటు వరదలతో ఎక్కువ నష్టపోయిన ప్రాంతాలు ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. వరద సాయంలో అక్రమాలకు పాల్పడ్డారని భావించి ఎన్నికల్లో సరైన తీర్పును ఇవ్వాలని నిర్ణయించుకుని... భాజపాకు గంపగుత్తగా 13 డివిజన్లను అప్పగించారు.

ఆర్కేపురం డివిజన్‌లో భాజపా తరఫున పోటీ చేసిన రాధా ధీరజ్ రెడ్డి రెండోసారి గెలిచారు. 2009లో ఓడిపోయినా... 2016 ఎన్నికల్లో గెలిచింది. ఇప్పుడు మరోసారి అధికార పార్టీ విజయాన్ని అడ్డుకుని కమలాన్ని వికసించేలా చేసింది. మరోవైపు పట్టున్న బీఎన్​రెడ్డి నగర్‌లోనూ తెరాసకు చేదు అనుభవమే ఎదురైంది. గెలుపుపై ధీమాతో ఉన్న గులాబీ దళం అంచనాలను తలకిందులు చేస్తూ స్వల్ప ఆధిక్యంతో బీఎన్​రెడ్డినగర్‌ డివిజన్‌ను భాజపా ఎగరేసుకుపోయింది.

ఇలా... అనూహ్యంగా ఎల్బీనగర్ పరిధిలోని 13 డివిజన్లలోనూ కమలనాథులు జయకేతనం ఎగరేయడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాం పెరిగింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఈ గెలుపు పార్టీకి మరింత కలిసివస్తుందని కాషాయ నాయకత్వం భావిస్తూ... ఆ దిశగా అడుగులు వేస్తోంది.

ఇవీచూడండి:

దిశ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం

Last Updated : Dec 5, 2020, 7:22 AM IST

ABOUT THE AUTHOR

...view details