ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్: రాష్ట్ర, జాతీయ పరీక్షల పరిస్థితి ఇదీ.!

కరోనా వైరస్ విజృంభణతో విద్యాసంవత్సరం సజావుగా సాగేలా కనిపించడం లేదు. జాతీయస్థాయిలో జరిగే ప్రవేశ పరీక్షల పరిస్థితిపై అనిశ్చితి నెలకొంది. మే నెలలో జరిగే ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌ను యూజీసీ నెట్‌తో సహా పలు పరీక్షలను వాయిదా వేశారు. ఈ పరిణామాలు గమనిస్తుంటే జూన్‌ వరకు ఎలాంటి ప్రవేశ పరీక్షలు జరిగే అవకాశం కనిపించడం లేదు. తాజాగా జులై 3న జరగనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కూడా వాయిదా వేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.

exams
పరీక్షలు

By

Published : May 1, 2021, 9:43 AM IST

కరోనా విరుచుకుపడుతుండటంతో కనీసం జూన్‌ నెలాఖరు వరకు ఏ ప్రవేశ పరీక్షా జరిగే పరిస్థితి కనిపించడం లేదు. పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పరీక్షలు వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌ పరీక్షలను వాయిదా వేశారు.

అదే బాటలో జులై 3న నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌!

తాజాగా జులై 3న జరగనున్న అడ్వాన్స్‌డ్‌ కూడా వాయిదా వేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌, మే నెల పరీక్షలు జరగడంతో పాటు ఫలితాలు విడుదల చేయాలి. మళ్లీ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఫలితంగా జులై 3వ తేదీన జరపడం కష్టమని కమిటీ ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌లో జరగాల్సిన నీట్‌ పీజీ, జూన్‌ 13న జరగాల్సిన క్లాట్‌, మే 21, 22 తేదీల నుంచి మొదలుకావాల్సిన సీఏ, మే 2 నుంచి 17 వరకు జరగాల్సిన యూజీసీ నెట్‌, ఇంకా పలు పరీక్షలను వాయిదా వేశారు. ఎన్‌ఐటీల్లో ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఈసారి మే 23న నిమ్‌సెట్‌ను నిర్వహించాల్సి ఉండగా కొవిడ్‌ కారణంగా వాయిదా వేసినట్లు ఎన్‌ఐటీ రాయ్‌పుర్‌ శుక్రవారం వెల్లడించింది.

పాలిసెట్‌ దరఖాస్తులు నేటి నుంచి కాదు

జూన్‌ 12న పాలిసెట్‌ జరపాలని గతంలో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నిర్ణయించింది. అందుకు మే 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ మొదలవ్వాలి. దరఖాస్తులు ప్రారంభం కావాలంటే పదో తరగతి విద్యార్థుల వివరాలు తప్పనిసరి. విద్యార్థి తన హాల్‌టికెట్‌ సంఖ్యను నమోదు చేస్తే అన్ని వివరాలు వస్తాయి. ఈసారి పది పరీక్షలను రద్దు చేయడం, హాల్‌టికెట్లను జారీ చేయకపోవడంతో పాలిసెట్‌ దరఖాస్తుల ప్రక్రియను వాయిదా వేసినట్లు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి(ఎస్‌బీటెట్‌) కార్యదర్శి డాక్టర్‌ సి.శ్రీనాథ్‌ తెలిపారు. హాల్‌టికెట్ల డేటా ఇచ్చేందుకు మరో వారం పది రోజులు పడుతుందని ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారులు చెప్పినట్లు సమాచారం. మరికొన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించకుండా దరఖాస్తుల సమర్పణ తేదీలను పొడిగించుకుంటూ వెళ్తున్నారు. ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తుల గడువు శుక్రవారంతో ముగియగా దాన్ని మే 8 వరకు పొడిగించారు. దీనికి ప్రవేశ పరీక్ష జూన్‌ 6న జరుపుతామని అధికారులు ప్రకటించినా... అప్పుడు జరిగే పరిస్థితి ఉండదని అధికారులు అంతర్గతంగా అంగీకరిస్తున్నారు.

ఇదీ చూడండి:పరీక్షలు పెట్టకపోతే వారి భవిష్యత్తేమిటి?

ABOUT THE AUTHOR

...view details