ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మేయర్లు, ఛైర్మన్ల ప్రమాణం.. ఏర్పాట్లు ముమ్మరం

రాష్ట్రవ్యాప్తంగా పురపాలక, నగరపాలక సంస్థల మేయర్‌, ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ కోసం అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో కొలువుదీరనున్న కొత్త పాలక వర్గాల.. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. అంతా ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపడుతున్నారు.

mayor and municipal chairmans swearing ceremony
మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక కోసం ఏర్పాట్లు ముమ్మరం

By

Published : Mar 17, 2021, 9:42 PM IST

Updated : Mar 17, 2021, 11:29 PM IST

ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్న అధికారులు

రాష్ట్రవ్యాప్తంగా పురపాలక, నగరపాలక సంస్థల మేయర్‌, ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లకు సంబంధించి అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలోని పలు పురపాలక, నగరపాలికల్లో కొలువుదీరనున్న కొత్త పాలక వర్గాల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సర్వం సిద్ధం చేస్తున్నారు.

గుంటూరు నగరపాలక సంస్థలో 11 ఏళ్ల తర్వాత కొత్త పాలకవర్గం కొలువుదీరనుంది. మేయర్ ఎన్నిక కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కౌన్సిల్‌హాల్‌తో పాటు అవసరమైన ఛాంబర్లు తుదిమెరుగులు దిద్దుకుంటున్నాయి. విశాఖలో కౌన్సిల్ సమావేశ మందిరాన్ని కలెక్టర్ వినయ్‌చంద్ సందర్శించారు. మేయర్ , డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.

కర్నూలులో ఏర్పాట్లు పూర్తి..

కర్నూలు నగరపాలక సంస్థ సహా జిల్లావ్యాప్తంగా పురపాలికల ఛైర్మన్ల ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తైనట్టు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. ప్రమాణస్వీకారానికి వచ్చేవారికి వాహన పార్కింగ్, ఇతర మౌలిక వసతులు కల్పిస్తున్నామని.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటామన్నారు.

కర్నూలు నగరపాలక మేయర్​గా బీవై రామయ్య పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఎన్నిక లాంఛనమే అని తెలుస్తోంది. జిల్లాలోని 9 లోకల్ బాడీస్​కు ఛైర్మన్ల విషయంలో దాదాపు స్పష్టత వచ్చినా.. వైస్ ఛైర్మన్ల విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

నంద్యాల మున్సిపాలిటీ ఛైర్ పర్సన్​గా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి నాగినిరెడ్డి పేరు వినిపించినా.. అధిష్ఠానం మైనార్టీలకు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మిగనూరులో బీసీ జనరల్ కు కేటాయించగా డాక్టర్ రఘు పేరు ఖరారైనట్లు సమాచారం. నందికొట్కూరు ఛైర్మెన్ జనరల్​కు కేటాయించారు. పీఠం కోసం ముగ్గురు పోటీ పడుతున్నారు. వీరిలో మొల్ల జాకీర్ హుస్సేన్, దాసి సుధాకర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఆళ్లగడ్డ ఛైర్మెన్​గా వైకాపా సీనియర్ నేత, వైద్యుడు రామలింగారెడ్డి పేరు ఇప్పటికే ఖరారైంది. ఆత్మకూరు ఛైర్ పర్సన్​గా యువ వైద్యురాలు మారుఫ్ ఆసియా పేరును ప్రకటించారు. ఆదోని బీసీ మహిళకు కేటాయించగా శాంతి, నాగరత్న పోటీ పడుతున్నారు. శాంతి పేరు ఖరారు కావచ్చని భావిస్తున్నారు. డోన్ మున్సిపాలిటీ ఛైర్మెన్ స్థానాన్ని బీసీ జనరల్​కు కేటాయించగా... సప్తశైల రాజేష్ పేరు ఖరారైంది. గూడూరు నగర పంచాయితీ ఛైర్మెన్ ను ఎస్సీ జనరల్ కు కేటాయించగా జులపాల వెంకటేశ్వర్లు పేరు వినిపిస్తోంది

తిరుపతిలో..

తిరుపతి నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్ గిరీషా తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలోని లలితాకళా ప్రాంగణం వేదికగా ప్రమాణ స్వీకార కార్యక్రమాలు జరగనున్నట్లు తెలిపారు.

జిల్లాలోని చిత్తూరు, తిరుపతి నగరపాలక సంస్థలతో పాటు పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, నగరి, పుత్తూరు పురపాలక సంస్థలను అధికార వైకాపా దక్కించుకొంది. దాదాపు మేయర్లు, చైర్మన్ల పేర్లు ఖరారయ్యాయి. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. చిత్తూరు మేయర్​గా అముద, తిరుపతి మేయర్‌ డాక్టర్‌ శిరీష పేర్లు ఖరారైనట్లు సమాచారం. మదనపల్లె పురపాలక సంస్థ ఛైర్మన్​గా మనూజను, పుంగనూరు పురపాలక ఛైర్మన్‌గా అలీంభాష, పలమనేరు పురపాలక సంస్థ ఛైర్మన్‌గా పవిత్ర, నగరి పురపాలక సంస్థ ఛైర్మన్​గా బీడి భాస్కర్‌, పుత్తూరు పురపాలక సంస్థ ఛైర్మన్​గా భువనేశ్వరిలు ఖరారైనట్లు తెలుస్తోంది.

కృష్ణా జిల్లాలో..

కృష్ణా జిల్లాలో రెండు కార్పొరేషన్లు, 3 నగర పంచాయతీలు, పురపాలికల్లో పాలకవర్గాల ఎంపిక జరగనుంది. విజయవాడ కార్పొరేషన్‌కు ప్రిసైడింగ్ అధికారిగా కలెక్టర్ ఇంతియాజ్ వ్యవహరించనుండగా.. మచిలీపట్నం మేయర్‌ ఎన్నికకు సంయుక్త కలెక్టర్ మాధవీలత ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మిగిలిన ప్రాంతాల్లో సబ్‌కలెక్టర్లు, ఆర్​డీఓలు ఎన్నికలను నిర్వహిస్తారని ఇంతియాజ్ వివరించారు.

విశాఖలో..

విశాఖలో గురువారం జరగబోయే మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లను కౌన్సిల్ సమావేశ మందిరంలో కలెక్టర్ వినయ్‌చంద్ సందర్శించారు. సభ్యులు కూర్చునే స్థానాలు, వారికి కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు.

ఇదీ చదవండి:

ఇంకా అభ్యర్థుల ఎంపిక పూర్తి కాలేదు.. జాబితా ప్రకటించట్లేదు: సజ్జల

Last Updated : Mar 17, 2021, 11:29 PM IST

ABOUT THE AUTHOR

...view details