తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. మరొక్క రోజే గడువు ఉండటంతో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇంటింటా ప్రచారం, రోడ్‌షోలు, ఆత్మీయ సమ్మేళనాలతో ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు.
రాములమ్మ ఫైర్
దిల్లీలో దళిత ఉద్యోగులను దారుణంగా బూతులు తిట్టి, కొట్టి అవమానించిన.. మంత్రి హరీశ్ రావుకు హుజూరాబాద్ ఎన్నికల బాధ్యత అప్పగించడం సిగ్గుచేటని మాజీ ఎంపీ విజయశాంతి ఆరోపించారు. అలాంటి హరీశ్ రావు దళిత బంధు గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హరీశ్ రావు ఎన్ని కథలు పడ్డా కేటీఆర్‌ను సీఎం చేసి భవిష్యత్‌లో పార్టీ నుంచి బయటకు పంపిస్తారని గుర్తు చేశారు.
నాకు ప్రజలు దగ్గరయ్యారు
తెలంగాణ ఉద్యమంలో అహర్నిశలు శ్రమించిన తనపై ఐదుగురు మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు తోడేళ్లలా దాడిచేస్తున్నారని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. జమ్మికుంటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ ఉపఎన్నిక వల్ల నియోజకవర్గానికి ఎన్నో పథకాలు వచ్చాయని పునరుద్ఘాటించారు. చాలా సార్లు పదవులు పోతే ప్రజలు దూరమౌతారు.. కానీ తనకు మాత్రం ప్రజలు దగ్గరయ్యారని ఈటల తెలిపారు.
తెరాస ప్రచారంలో విభేదాలు
హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో తెరాసలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. ఇల్లంతకుంట మండలం సిరిసేడులో ధూంధాం నిర్వహించిన తర్వాత తిరిగి వెళ్తుండగా కౌశిక్ రెడ్డి అనుచరులు.. కౌశిక్ రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో మరికొందరు యువకులు.. గెల్లు శ్రీనివాస్ జిందాబాద్ అని నినదిచడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఆ కార్యక్రమానికి హాజరైన ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుతోపాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరులకు నచ్చచెప్పాలని కౌశిక్‌రెడ్డికి సూచించారు. నినాదాలు చేస్తుండగానే కౌశిక్ రెడ్డి వెళ్లిపోయారు. ఆ తర్వాత గెల్లు శ్రీనివాస్‌ను అతని అనుచరులు భుజాలపై ఎత్తుకొని జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు మాట్లాడిన మంత్రి హరీశ్ రావు ఈటల రాజేందర్ పార్టీ కోసం ఏదో చేసినట్లు గొప్పగా చెబుతున్నారని ఆరోపించారు. కమలాపూర్ నుంచి దామోదర్‌రెడ్డిపై మొదటిసారి పోటీ చేసినప్పుడు ఈటల రాజేందర్ ఎవరికైనా తెలుసా అని ప్రశ్నించారు.
ఒక్క అవకాశం ఇవ్వండి
కాంగ్రెస్ అభ్యర్ధి బల్మూరి వెంకట్‌కు మద్దతుగా సైదాబాద్, జగ్గయ్యపల్లిలో ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానం వల్ల ప్రజలు ఎంతగానో ఇబ్బందుల పడుతున్నారని ఆ రెండు పార్టీలను ఓడించి వెంకట్‌కు మద్దతు పలకాలని శ్రీధర్‌బాబు కోరారు.
ఒక్కరోజు గడువు మాత్రమే ఉండటంతో నేతలు ప్రచారాన్ని మరింత మమ్మరం చేశారు. ఇవాళ జమ్మికుంటలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వీణవంకలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ హరీశ్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ ప్రచారం చేయనున్నారు.
ఇదీ చూడండి:
CM JAGAN: రైతు పథకాలు... నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్