రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం అమలు చేసేందుకు ఎనిమిది నెలల సమయం పట్టే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సచివాలయంలో మొదటి బ్లాక్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కొవిడ్ టాస్క్ ఫోర్సు కమిటీ సమావేశమైంది. రాష్ట్ర జనాభా 5 కోట్ల మందికి రెండు డోసుల చొప్పున 10 కోట్ల డోసుల వ్యాక్సిన్ అవసరం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. దీనికి అనుగుణంగా 3 లక్షల 76 వేల లీటర్ల మేర వ్యాక్సిన్ నిల్వలకు అవకాశం ఉందని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది.
ఎనిమిది నెలల కాలానికి గానూ....
ఈ ఎనిమిది నెలల కాలానికి గానూ 1 కోటీ 31 లక్షల 75 వేల వయల్స్ అవసరం కానున్నట్టు ప్రభుత్వం అంచనా వేస్తోంది. కొవిడ్ వ్యాక్సిన్ నిల్వ కోసం 2 నుంచి 8 డిగ్రీల మధ్య శీతలీకరణ ఏర్పాట్లలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలకు చేరిన 36 లార్జ్ ఐఎల్ఆర్( ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్లు ) అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం జిల్లాలకు రెండేసి చొప్పున ఐఎల్ఆర్లు, మిగిలిన 10 జిల్లాలకు మూడు చొప్పున ఐఎల్ఆర్లను కేంద్రం సమకూర్చనుందని ప్రభుత్వం భావిస్తోంది.