విజయనగరం జిల్లాలో..
విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో ఒకటే ఆధార్ నమోదు కేంద్రం ఉండటం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలకు ఆధార్ ఈ కేవైసీ నమోదు తప్పనిసరి చేయడం, గడువు ఈ నెల 30 వరకే అని తెలియడంతో ప్రజలు, చిన్నారులు, గర్భిణులు అని తేడా లేకుండా.. అంతా ఆధార్ సెంటర్లకు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే క్యూలో నిల్చున్నారు. కేంద్రాల సంఖ్య పెంచి సమస్య తీర్చాలని మహిళలు వేడుకుంటున్నారు.
విశాఖ జిల్లా అరకులో..
అరకు వ్యాలీలోని ఆధార్ కేంద్రానికి వేల సంఖ్యలో ప్రజలు ఆధార్ ఈ కేవైసీ కోసం తరలివస్తున్నారు. అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగూడ మండలాల పరిధిలోని 600 గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఆధార్ ఈ కేవైసీ కోసం బారులు తీరారు. అరకు లోయలోనూ ఒకే ఆధార్ కేంద్రం ఉంది. లోయ ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వస్తున్న ప్రజలు ఆధార్ అనుసంధానం కోసం ఇబ్బందులకు గురవుతున్నారు. భారీగా తరలి వస్తున్న వారిని నియంత్రించడానికి పోలీసులను ఏర్పాటు చేయవలిసిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు.. కరోనా నియమాలను పాటించే వారే కనిపించటం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అరకులోయలో అదనంగా ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఆధార్ ఈ కేవైసీ తిప్పలు.. సెంటర్ల ముందు బారులు! కర్నూలు జిల్లాలో..
కర్నూలు జిల్లా గూడూరు మండలంలో 9 వేల మంది కార్డు దారులు ఉన్నారు. ఈ - కేవైసీ కోసం అధార్ సెంటర్ వద్ద జనాలు పెద్ద ఎత్తున గుమిగుడారు. వీరితో పాటు సి.బెళగల్ మండలానికి చెందిన రేషన్ కార్డు దారులు సైతం గూడూరులోని ఆధార్ సెంటర్‌కే వెళ్తున్న కారణంగా అక్కడ కిటకిటలాడుతోంది.
రెండు మండలాలకు చెందిన రద్దీని నియంత్రించడానికి కార్డుదారులకు సిబ్బంది టోకెన్లు ఇచ్చి పంపిస్తున్నారు. రోజుకు యాభై మించి నమోదు చేయలేమని తేల్చి చెప్పేశారు. నమోదు చేసిన తర్వాత ఆధార్ అప్డేషన్కు 10 రోజుల సమయం పడుతుందని చెప్పారు. మరోవైపు.. గడువు ఇంకా 10 రోజులే ఉండడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో..
చీరాల పట్టణంలోని బ్యాంకులు, పొస్టాఫీసుల ముందు పిల్లలతో జనాలు బారులు తీరారు. ఆధార్ నమోదు కేంద్రాలు తక్కువగా ఉండటంతో తెల్లవారుజాము నుంచే కేంద్రాల వద్ద, కార్యాలయాల వద్ద ఈకేవైసీ కోసం పిల్లలతో జనాలు క్యూ కట్టారు. ఆధార్ నమోదు కేంద్రాల సంఖ్య పెంచి, గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా నమోదు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఒకే చోట ప్రజలు గుమిగూడకుండా చేయొచ్చని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:
వివేకా హత్య కేసు: 73వ రోజు సీబీఐ విచారణ.. అధికారులను కలిసిన సునీత