ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో క్రమంగా మొదలవుతున్న కార్యకలాపాలు - Activities starting gradually in the state

కరోనా మహమ్మారి ఇప్పట్లో పోయేలా లేదు. అలాగని నెలల తరబడి ఇంట్లో కూర్చుంటే బతుకు బండి నడిచేదెలా? ఈ భావన క్రమంగా ప్రజల్లో వస్తోంది. అందుకే బయటకు వస్తున్నారు. రోజువారీ వ్యవహారాల్లో నిమగ్నమవుతున్నారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలూ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. పరిశ్రమల్లో ఉత్పత్తి మొదలైంది. నిర్మాణ రంగంలో కదలిక కనిపిస్తోంది. విమానాలు, బస్సులు, రైళ్లు నడుస్తున్నాయి. అయితే కరోనా తీవ్రంగా ఉన్న ఈ సమయంలో అజాగ్రత్తగా ఉంటే ముప్పు తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు పెట్టుకోకపోవడంవల్ల కరోనా విస్తరించే ప్రమాదమూ లేకపోలేదని నిపుణులు అంటున్నారు.

Activities starting gradually in the state
రాష్ట్రంలో క్రమంగా మొదలవుతున్న కార్యకలాపాలు

By

Published : Sep 13, 2020, 7:08 AM IST

కరోనాతో ఎక్కడికక్కడ స్తంభించి పోయిన రంగాల్లో మళ్లీ కదలిక మొదలైంది. విమానాలు, రైళ్లు, బస్సు సర్వీసులు క్రమంగా పెరుగుతున్నాయి. మొదట్లో ప్రయాణాలంటే భయపడిన ప్రజలు.. ఇప్పుడిప్పుడే తగిన జాగ్రత్తలతో వెళ్తున్నారు. దేశవ్యాప్తంగా శుక్రవారం వరకు 230 రైళ్లు నడిచాయి. మూడు నాలుగు వారాలుగా ఆక్యుపెన్సీ రేటు పెరగడంతో రైల్వేశాఖ మరో 80 రైళ్లు ప్రారంభిస్తోంది. గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో వచ్చే వారం పాటు 100 నుంచి 200 వరకు వెయిటింగ్‌ లిస్టు ఉంది. మిగిలిన రైళ్లలోనూ సీట్లన్నీ నిండుతున్నాయి.

*అంతర్జాతీయ విమాన సర్వీసులు మొదలు కాకపోయినా.. ఉద్యోగం, చదువు కోసం విదేశాలకు వెళ్లేవారు వందే భారత్‌ విమానాల్లో గమ్య స్థానాలకు చేరుతున్నారు. బ్రిటన్‌ సహా ఐరోపా దేశాలు స్టూడెంట్‌ వీసాలను జారీ చేస్తున్నాయి. దేశీయ విమాన సర్వీసులూ పెరుగుతున్నాయి.విశాఖ, విజయవాడలకు బెంగళూరు, హైదరాబాద్‌, దిల్లీ, చెన్నై నుంచి విమానాలు వస్తున్నాయి. కనీసం 60% ఆక్యుపెన్సీ ఉంటోంది. లాక్‌డౌన్‌ అనంతరం విమానాలు మొదలైన కొత్తలో.. కొందరు ప్రయాణికులు పీపీఈ కిట్లు ధరించేవారు. కానీ ఇప్పుడు కరోనాకు ముందు నాటి నిబంధనలే పాటిస్తున్నారు. ప్రయాణికులకు విమానయాన సంస్థలు ఫేస్‌షీల్డ్‌, మాస్క్‌, గ్లౌజ్‌లను అందజేస్తున్నాయి.

*ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల పరుగులు మొదలయ్యాయి. మే 21 నుంచి ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. మొదట్లో సుమారు 1,500 బస్సులు నడిపారు. ఆగస్టు మధ్య నాటికి వాటి సంఖ్య 3వేలకు చేరింది. ప్రస్తుతం 3,800కి పెంచారు. జులైలో సగటు ఆక్యుపెన్సీ 47%, ఆగస్టులో 53% నమోదైంది.

మొదలైన వ్యాపార కార్యకలాపాలు

రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో వ్యాపార కార్యకలాపాలు మొదలయ్యాయి. వస్త్ర, బంగారు దుకాణాలు, ఇతర వ్యాపార, వాణిజ్య సముదాయాలు తెరుచుకున్నాయి. క్రమంగా వ్యాపారం పెరుగుతోంది. ప్రస్తుతం 40% వరకు వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం.

*దుకాణాలు, మాల్స్‌ వ్యాపార సమయాలపై ఉన్న నియంత్రణల్నీ దాదాపు తొలగించారు. ప్రస్తుతం రాత్రి 8-9 గంటల వరకు తెరిచే ఉంటున్నాయి. విజయవాడలో అత్యంత రద్దీ ఉండే బీసెంట్‌ రోడ్డులోనూ రాత్రి 8 గంటల వరకు వ్యాపార కార్యకలాపాలకు అనుమతిచ్చారు. దుకాణాలు, మాల్స్‌లో వినియోగదారుల చేతుల్లో శానిటైజర్‌ వేసి, ఉష్ణోగ్రతలు పరిశీలించాక లోపలికి అనుమతిస్తున్నారు.

*కరోనాతో బాగా దెబ్బతిన్న వాటిలో వాహన రంగం ఒకటి. ఆంక్షలు సడలించాక క్రమంగా వాటి వ్యాపారం మెరుగుపడుతోంది. ప్రస్తుతం కార్లు, ద్విచక్ర వాహనాల విక్రయాలు పెరిగాయని, ఆగస్టు వ్యాపారం దాదాపు గత సంవత్సరం ఆగస్టుతో సమానంగా ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

భయపడుతూ.. జాగ్రత్తలు పాటిస్తూ..

*కరోనా అంటే భయం ఉన్నా.. జాగ్రత్తలు పాటిస్తూనే బ్యాంకులు, ప్రైవేటు కార్యాలయాల్లో సిబ్బంది పని చేస్తున్నారు. ఆగస్టు నెలాఖరు వరకు బ్యాంకులు మధ్యాహ్నం ఒంటిగంట వరకే పని చేసేవి. సెప్టెంబరు 1 నుంచి పూర్తి సమయం పని చేస్తున్నాయి. కస్టమర్లు వచ్చిన పనేంటో తెలుసుకున్నాకే లోపలికి అనుమతిస్తున్నారు. ఒకేసారి ఎక్కువ మంది గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

*కొన్ని ప్రైవేటు కార్యాలయాల్లో సిబ్బందిని రెండు బృందాలుగా విభజించి, వేర్వేరు సమయాల్లో పని చేయిస్తున్నారు. ఇదివరకు ఒక కార్యాలయంలో పని చేసే ఉద్యోగుల్లో ఎవరికైనా కరోనా వస్తే మొత్తం కార్యకలాపాలు నిలిచిపోయేవి. ప్రస్తుతం కరోనాసోకినవారు చికిత్స పొందుతుండగా.. మిగతా ఉద్యోగులు జాగ్రత్తలు పాటిస్తూ పని చేసుకుంటున్నారు. గతంలోలా కార్యాలయాన్ని మూసేయడం లేదు.

*అపార్టుమెంట్లలో ఎవరైనా ఒకరికి కరోనా వస్తే అందరూ బెంబేలెత్తేవారు. బయటివారు లోనికి, లోపలివారు బయటకు కదలకుండా అసోసియేషన్లు ఆంక్షలు పెట్టేవి. ఇప్పుడా పరిస్థితుల్లేవు. పక్క ఫ్లాట్‌లో ఎవరికైనా కరోనా వచ్చిందని తెలిసినా.. పెద్దగా ఆందోళన చెందడం లేదు. వీలైతే వారికేమైనా సాయం కావాలేమోనని అడిగే సంస్కృతి పెరిగింది.

స్థిరాస్తి రంగంలోనూ కదలిక

*కరోనా సమయంలో స్థిరాస్తి రంగం పూర్తిగా స్తంభించింది. వలస కూలీలు సొంత ప్రాంతాలకు వెళ్లిపోవడంతో నిర్మాణాలు నిలిచిపోయాయి. స్థలాలు, ఫ్లాట్లు కొనాలనుకున్నవారూ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు కొంత కదలిక మొదలైంది. నిలిచిపోయిన నిర్మాణాలను పూర్తి చేస్తున్నారు. గతంలో 50 మంది పని చేసిన చోట ఇప్పుడు 15-20 మందితో నడిపిస్తున్నారు. ఫ్లాట్ల కొనుగోళ్లకు ఇప్పుడిప్పుడే వస్తున్నారని విజయవాడకు చెందిన ఒక బిల్డర్‌ చెప్పారు.

*కరోనావల్ల పూర్తిగా కుదేలైన వాటిలో ఆతిథ్య రంగం ఒకటి. హోటళ్లు, రెస్టారెంట్లన్నీ మూతపడ్డాయి. ప్రధాన నగరాల్లోని హోటళ్లలో కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. రెస్టారెంట్లకు వెళ్లడానికి జనం ఇంకా భయపడుతున్నారు. పార్సిళ్లు మాత్రం తీసుకెళ్తున్నారు.

*వ్యాయామశాలలకు గతంతో పోలిస్తే సగం మందే వస్తున్నారని విశాఖకు చెందిన ఒక జిమ్‌ నిర్వాహకుడు తెలిపారు. ‘శానిటైజర్‌, థర్మామీటర్‌, పల్స్‌ ఆక్సీమీటర్‌ పెట్టుకున్నాం. వ్యాధి లక్షణాలు లేనివారినే అనుమతిస్తున్నాం. ఉదయం జిమ్‌ తెరిచేటప్పుడు, రాత్రి మూయడానికి ముందు శుద్ధి చేస్తున్నాం’ అని తెలిపారు.

*దేవాలయాలకు వెళ్లేవారి సంఖ్యా పెరుగుతోంది. భౌతిక దూరం పాటిస్తూ దేవుడిని దర్శించుకుంటున్నారు.

ఇదీ చదవండి:నిధుల వేటలో ప్రభుత్వం... గ్యాస్​పై 10 శాతం వ్యాట్ పెంపు

ABOUT THE AUTHOR

...view details