ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అనారోగ్యం దూరమై... విజయాలే జీవితమై..! - yoga expert gnaneshwar from tirupati

జ్ఞానేశ్వర్... ఎముకలున్నాయా లేవా అన్నట్లు శరీరాన్ని చుట్టేస్తూ....అరుదైన యోగాసనాలు వేస్తాడు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య కళాశాలలో బీవీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న అతను... ఇష్టంతో ఎంతో కష్టపడి యోగాసనాలను నేర్చుకున్నాడు. యోగపై తనకున్న పరిజ్ఞానాన్ని... యువత, చిన్నారులకు చేరవేస్తున్నాడు. సొంత యూట్యూబ్‌ ఛానెల్ ద్వారా యోగాకు ప్రాచుర్యం కల్పిస్తున్నాడు.

a-young-man-gnaneshwar
a-young-man-gnaneshwar

By

Published : Sep 7, 2020, 7:46 PM IST

అనారోగ్యం దూరమై... విజయాలే జీవితమై..!

తిరుపతి విద్యానగర్‌కు చెందిన జ్ఞానేశ్వర్‌...యోగాలోని అన్నిరకాల ఆసనాలను అవలీలగా వేస్తూ యోగా శిక్షకుడిగా ప్రత్యేకత చూపుతున్నాడు. పదేళ్ల వయసులో తరచూ అనారోగ్యం బారిన పడుతున్న జ్ఞానేశ్వర్‌ను...తండ్రి యోగా తరగతులకు పంపించాడు. యోగా సాధన ద్వారా ఆరోగ్యం మెరుగువడంతో... ఆసనాలపై ఇంకా మక్కువ పెంచుకున్నాడు. యోగసనాలను జీవితంలో ఒక భాగం చేసుకున్నాడు. యోగాలో మరింత పట్టు సాధించేందుకు అడ్వాన్స్‌ యోగాపై దృష్టి సారించాడు.

పుస్తకాల ద్వారానే...

అడ్వాన్స్ యోగా నేర్పే గురువులు అందుబాటులో లేకపోవటంతో జ్ఞానేశ్వర్‌..పుస్తకాల ద్వారానే అడ్వాన్స్‌ యోగా గురించి తెలుసుకున్నాడు. సాధనతో ఈ యోగసనాల్లో నైపుణ్యం సాధించాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల విజేతలుగా నిలిచిన వారి ద్వారా ఈ యోగాలో మెళకువలు నేర్చుకున్నాడు. అడ్వాన్స్‌ యోగాలో జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు అనేక బహుమతులు తన ఖాతాలో వేసుకున్నాడు.

ఉత్తమ ప్రతిభ...

  • చెన్నై వేదికగా జరిగిన ఇంటర్నేషనల్‌ యోగా ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో జ్ఞానేశ్వర్‌ ప్రథమస్థానం సొంతం చేసుకున్నాడు.
  • పూణే వేదికగా జరిగిన అంతర్జాతీయ యోగా పోటీల్లోనూ పతకం దక్కించుకున్నాడు.
  • 2012 తమిళనాడులో నిర్వహించిన ఆల్‌ ఇండియా ఇంటర్ స్టేట్‌ యోగా ఛాంపియన్‌షిప్ పోటీలో స్వర్ణం సాధించాడు.
  • 2013లో ఒలంపిక్‌ డే రన్‌ స్పోర్ట్‌ మీట్‌లో ఛాంపియన్‌గా నిలిచాడు.
  • 2013 ఇంటర్‌నేషనల్ యోగా పెస్టివల్‌లో పతకం సాధించాడు.
  • 2014 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ చూపాడు.
  • 2014, 2015లో రాజీవ్‌గాంధీ ఖేల్‌ అభియాన్‌ ఆంధ్రప్రదేశ్ రూరల్ స్పోర్ట్స్ పోటీల్లో మొదటి బహుమతి గెల్చుకున్నాడు...జ్ఞానేశ్వర్‌.
  • 2015 గోదావరి పుష్కరాల సందర్భంగా నిర్వహించిన యోగా పోటీలో విజేతగా నిలిచాడు.
  • 2018లో దిల్లీ నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో యోగా ప్రదర్శన చేసే అవకాశాన్ని అందిపుచ్చుకున్న జ్ఞానేశ్వర్... చక్కని నైపుణ్యంతో ఆహుతుల్ని అలరించాడు.

టైమ్ ఫర్ యోగా....

జాతీయ, అంతర్జాతీయ స్థాయి యోగా పోటీల్లో ప్రదర్శన చేయడం ద్వారా ప్రత్యేక గుర్తింపు సాధించిన జ్ఞానేశ్వర్‌... బెంగళూరు వివేకానంద యోగా యూనివర్శిటీ నుంచి యోగా ఇన్‌స్ట్రక్టర్‌ కోర్స్‌ పూర్తి చేశాడు. యోగా శిక్షణకు అవసరమైన అర్హత సాధించాడు. తిరుపతి నగరంలో అడ్వాన్స్‌ యోగాపై స్థానిక యువతకు మెలకువలు నేర్పుతున్నాడు. పశువైద్య విద్య అభ్యసిస్తూనే అడ్వాన్స్‌ యోగాపై వీడియోలు రూపొందిస్తున్నాడు.

ఇటీవలే టైమ్‌ ఫర్‌ యోగా పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన జ్ఞానేశ్వర్‌...అడ్వాన్స్‌ యోగా వీడియోలను అందుబాటులోకి తెస్తున్నాడు. నిరంతర సాధనతో అడ్వాన్స్‌ యోగాలో ఉత్తమ నైపుణ్యం సంపాదించిన జ్ఞానేశ్వర్‌..తన వీడియోల ద్వారా గ్రామీణ ప్రాంత వాసులకు యోగాను చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. సైనికాధికారిగా దేశానికి సేవ చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.

ఇదీ చదవండి:

క్రిమిసంహారక టన్నెల్స్​పై కేంద్రం నిషేధం!

ABOUT THE AUTHOR

...view details