తన పొలంలోకి వచ్చి అరుస్తున్నాయని.. మూడు గాడిదలను వేటకొడవలితో నరికేశాడో సైకో.తెలంగాణలోని వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం చెరువు ముందలి తండా శివారులో ఈ దారుణం చోటుచేసుకుంది. అంతారం గ్రామానికి చెందిన క్రిష్ణయ్య సైకోలా వ్యవహరిస్తూ మూడు గాడిదలను వేటకొడవలితో నరికేశాడు. ఇందులో రెండు చనిపోగా..మరొకటి కొన ఊపిరితో ఉంది.
DONKEYS MURDER: పొలంలోకి వచ్చి అరుస్తున్నాయని.. గాడిదలను చంపిన సైకో..
ఆ మూగ జీవాలే గొర్రెల కాపరికి అండ. ఊరూరా తిరుగుతూ వలసలు వెళ్తున్న కాపర్ల వస్తువులను మోసేందుకు ఆ గాడిదలు సహాయపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఊరికి వలస వెళ్లారు. రాత్రి అయ్యేసరికి గ్రామ శివారులో ఓ చోట నిద్రిస్తూ గాడిదలను వదిలేశారు. కానీ తెల్లారేసరికి అవి శవాలుగా పడి ఉన్నాయి. ఓ సైకో చేసిన నిర్వాకంతో ఆ మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
నారాయణ పేట్ జిల్లాకు చెందిన లక్ష్మణ్ కుటుంబ సభ్యులు.. గొర్రెలు మేపుకుంటూ ఆదివారం చెరువు ముందలి తండాకు వలస వచ్చారు. రాత్రి కావడంతో తండా శివారు పొలాల్లో నిద్రించారు. తనతో తెచ్చుకున్న గాడిదలను ఆ ప్రాంతంలో వదిలేశాడు. తెల్లారి లేచి చూసేసరికి గాడిదలు కనిపించలేదు. గొర్రెలు మేపేందుకు వెళ్లి వచ్చేసరికి.. రెండు గాడిదలు మృతదేహాలుగా పడి ఉన్నాయి. మరొకటి తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతుండగా వైద్యం అందించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కుల్కచర్ల పోలీసులు దర్యాప్తు చేప్టటారు. మూగజీవాలను చంపింది కృష్ణయ్యగా గుర్తించిన పోలీసులు.. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. గతంలో ఇలాంటి ఘటనలకు ఆ సైకో పాల్పడినట్లు గ్రామస్థులు ఆరోపించారు. తమ సామాన్లు మొసే గాడిదలు హత్యకు గురికావడంతో గొర్రెల కాపరులు లబోదిబోమంటున్నారు.
రెండు గాడిదలను దారుణంగా చంపేశాడు. మూడోదానికి తీవ్ర గాయాలయ్యాయి. దానికి వైద్యం అందిస్తున్నాం. గతంలో కూడా క్రిష్ణయ్య ఇలాంటి దారుణాలు ఎన్నో చేసి జైలు జీవితం గడిపాడని స్థానికులు చెబుతున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించాము. -విఠల్ రెడ్డి, ఎస్సై, కుల్కచర్ల పీఎస్