ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రెప్పపాటులో ఘోరాలు.. రాష్ట్రంలో మూడేళ్లలో 563 మరణాలు - road accidents in ap

విశ్రాంతి కోసమో, మరమ్మతులు చేసేందుకో, మరో కారణంతోనో ప్రధాన రహదారులపై వాహనాల్ని నిలపడం ఏటా వందల ప్రమాదాలకు కారణమవుతోంది. ఇలా నిలిపి ఉన్న వాహనాలను.. దగ్గరకు వచ్చేంత వరకూ ఇతర వాహనాల డ్రైవర్లు గమనించకపోవటం వల్ల ఘోర దుర్ఘటనలు సంభవిస్తున్నాయి. వెరసి వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

563 people have been killed in three years due to collisions with parked vehicles in the state.
రాష్ట్రంలో మూడేళ్లలో 563 మంది మృతి

By

Published : Dec 12, 2020, 5:59 AM IST

Updated : Dec 12, 2020, 8:16 AM IST

ఇటీవల రాష్ట్రంలో ఈ తరహా ప్రమాదాలు బాగా పెరిగాయి. ఒక్క కృష్ణా జిల్లాలోనే గత పది రోజుల వ్యవధిలో ఈ తరహా ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మూడేళ్లలో ఇలా ఆగి ఉన్న వాహనాలను ఢీకొట్టడం వల్ల 1,827 ప్రమాదాలు సంభవించగా.. 563 మంది చనిపోయారు.

ముందే జాగ్రత్తగా ఉంటే!
* ఆగి ఉన్న లారీలను ఢీకొడుతున్న ప్రమాదాల్ని విశ్లేషిస్తే డ్రైవర్లకు తగిన విశ్రాంతి లేకపోవటం, నిద్రమత్తు, అతివేగం కారణాలుగా తేలుతున్నాయి.
* ఇంకాస్త ప్రయాణిస్తే గమ్యం చేరిపోవచ్చు కదా అనే ఆత్రుత, నిద్రను తట్టుకోగలమన్న అతి విశ్వాసం ప్రాణాల మీదకు తెస్తోంది.
* ఆవలింతలు వచ్చినా, తెలియకుండా కళ్లు మూతలు పడుతున్నా వాహనాన్ని రోడ్డుపై కాకుండా కొంచెం దూరంలో ఆపి విశ్రాంతి తీసుకోవాలి.
* రహదారి ఎంత వెడల్పుగా ఉన్నప్పటికీ.. ముందు వెళ్తున్న వాహనాలతో నిబంధనల మేరకు ఎడం పాటించాలి.

ప్రమాదం-1
రెప్పపాటులో ఘోరం

భీమవరం నుంచి నుంచి నూజివీడు వెళ్తున్న కారు.. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరు వద్ద కోల్‌కతా- చెన్నై జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ నెల 7న వేకువజామున 3.30 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లారీని నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్‌ చేయడం, డ్రైవర్‌ అతివేగం, నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అంచనాకు వచ్చారు. కారు డ్రైవర్‌కు తగినంత విశ్రాంతి లేకపోవటంతో ఒక్కసారిగా మగత ఆవహించింది. అప్పటికే వేగంగా ప్రయాణిస్తుండటంతో రెప్పపాటులో అదుపుతప్పి రోడ్డుపై ఆపి ఉన్న లారీని ఢీకొంది. కారు ముందుభాగమంతా లారీ కిందకు చొచ్చుకెళ్లి నుజ్జునుజ్జయ్యింది. కారు డ్రైవర్‌ అప్రమత్తంగా ఉన్నా, లారీ డ్రైవర్‌ రోడ్డుపైనే నిలిపి ఉంచకపోయినా.. ఇంతటి ఘోరం జరిగేది కాదు.

ప్రమాదం-2
లారీ వేగాన్ని అంచనా వేయలేక..

ఈ నెల 10న వేకువజామున 3.30 గంటల సమయంలో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని వేములవాడ నుంచి మధిరకు బయల్దేరిన కారు గరికపాడు వద్దకు చేరుకుంది. ఆ సమయంలో కారు డ్రైవర్‌ అలసట, ముందు వెళ్తున్న లారీ వేగాన్ని అంచనా వేయలేకపోవడం, త్వరగా ఇల్లు చేరుకోవాలన్న ఆరాటంలో అతివేగం.. ఈ ప్రమాదానికి దారితీశాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీని దాని డ్రైవర్‌ గరికపాడు వద్దకు రాగానే పై వంతెనపైకి ఎక్కించే క్రమంలో వేగం తగ్గించాడు. దాని వెనుకే వస్తున్న కారు డ్రైవర్‌ ఈ ఉత్పాతాన్ని ఊహించలేకపోయాడు. లారీ డ్రైవర్‌ డిప్పర్‌ వేసి సంకేతాలిచ్చి ఉన్నా... కారు డ్రైవర్‌ ముందు వెళ్తున్న లారీకి కనీసం 50 అడుగుల దూరం పాటించినా.. ఈ ప్రమాదం తప్పేది.

ప్రమాదం-3
మింగేసిన మూలమలుపు

చెన్నై నుంచి తూర్పుగోదావరి జిల్లా వైపు వెళ్తున్న ఓ కారు.. కృష్ణా జిల్లా గన్నవరం వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ నెల 5న తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గన్నవరం పాత స్టేట్‌బ్యాంక్‌ మూలమలుపు వద్ద ఓ లారీని దాని డ్రైవర్‌ నిలిపి ఉంచాడు. అప్పటికే చెన్నై నుంచి కారు నడుపుతూ వస్తున్న డ్రైవర్‌కు తగిన విశ్రాంతి లేదు. నిద్రమత్తు తోడవ్వడంతో రోడ్డుపై నిలిపిన లారీని గమనించలేకపోయాడు. వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. కారు ముందు సీటులో కూర్చున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మలుపు వద్ద కారు వేగాన్ని తగ్గించినా, మలుపులో లారీని నిలపడం ప్రమాదకరమన్న స్పృహతో లారీ డ్రైవర్‌ అక్కడ పార్కింగ్‌ చేయకపోయినా ఈ దుర్ఘటన జరిగేది కాదు.

ఇవన్నీ నిబంధనల ఉల్లంఘనే!

* జాతీయ, రాష్ట్ర, ఇతర ప్రధాన రహదారులపై నిత్యం వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వందల కిలోమీటర్లు ప్రయాణం చేసే లారీ, ట్రక్కు, వ్యాన్ల డ్రైవర్లు చాలా సందర్భాల్లో రోడ్లపైనే ఓ అంచుకు వాహనాల్ని ఆపేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఫ్లాషర్‌ను ఉపయోగించకపోవటం, భారీ వాహనాన్ని పార్కింగ్‌ చేసినట్లు సంకేతాలు ఇవ్వకపోవడం ప్రమాదానికి కారణమవుతుంది. అదే దారిలో వచ్చే ఇతర వాహనాల డ్రైవర్లు దగ్గరకు చేరేంత వరకూ గుర్తించలేకపోతున్నారు. గమనించిన మరుక్షణమే అప్రమత్తమైనా.. వాహనం నియంత్రణలోకి రాక ఘోరాలు జరిగిపోతున్నాయి.
* భారీ వాహనాలకు అన్ని వైపులా రేడియం టేపు అతికించాలన్న నిబంధన పాటించడం లేదు. రాత్రి వేళలో వెనుకనున్న వాహన చోదకులు ముందున్న వాటిని గుర్తించలేక, వాటి వేగాన్ని అంచనా వేయలేక ఢీ కొడుతున్నారు
* ట్రక్కులు, లారీల డ్రైవర్లు వాటికి కేటాయించిన పార్కింగ్‌ లే బేస్‌లలో కాకుండా.. ఎక్కడపడితే అక్కడ నిలుపుతున్నారు. అత్యవసరంగా ఆపాల్సి వచ్చినా.. వెనుక వైపు లైట్లు ఆన్‌లో ఉంచడం లేదు.
* మంచు కురవడం, వెలుతురు కొరవడటం వల్ల ఇలా నిలిపిన వాహనాలను చోదకులు గుర్తించలేకపోతున్నారు.

ఇదీ చదవండి:

బాధితుల రక్తంలో ఆర్గానో క్లోరిన్‌, ఫాస్పరస్‌

Last Updated : Dec 12, 2020, 8:16 AM IST

ABOUT THE AUTHOR

...view details